'మోడీతోనా.. దేశంతోనా..?'.. ఎవరితో ఉండాలో కాంగ్రెస్ నిర్ణయించుకోవాలి : అరవింద్ కేజ్రీవాల్

‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, 140 కోట్ల మంది దేశ ప్రజలతోనా.. ప్రధాని మోడీతోనా’ ఎవరితో ఉండాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.

Update: 2023-06-02 16:26 GMT

రాంచీ: ‘ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, 140 కోట్ల మంది దేశ ప్రజలతోనా.. ప్రధాని మోడీతోనా’ ఎవరితో ఉండాలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ఉన్నతాధికారుల నియామకం, విజిలెన్స్, బదిలీపై అధికారాన్ని కేంద్రానికి దఖలు చేస్తూ మోడీ సర్కారు జారీ చేసిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల నాయకుల మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్ శుక్రవారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోరెన్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కేంద్రం హరించిందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని సుప్రీం కోర్టు ఆదేశించినా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడం ప్రజాస్వామ్య పునాదిపై దాడి అని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా మోడీ సర్కారు మోకాలడ్డుతోందన్నారు.

పార్లమెంటులో ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా చూడాల్సిన బాధ్యత బీజేపీయేతర పార్టీలపై ఉందన్నారు. లోక్ సభలో మెజారిటీ ఉన్న బీజేపీ అక్కడ బిల్లును పాస్ చేయించుకుంటుందని, రాజ్యసభలో బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి వస్తే ఈ బిల్లును ఓడించవచ్చన్నారు. ఈ రోజు ఢిల్లీ, రేపు మరో పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, తమిళనాడు.. ఇలా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో దొడ్డిదారిన మోడీ సర్కారు అధికారాన్ని కైవసం చేసుకునే కుట్రకు తెరలేపిందన్నారు. కేంద్రం ఆర్డినెన్స్ ను ‘సమాఖ్య నిర్మాణం’పై దాడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అభివర్ణించారు. ఇది ప్రభుత్వంపైనే కాదు.. ప్రజలపైనా దాడి అన్నారు. ఆర్డినెన్స్ పై కేజ్రీవాల్ కు అండగా నిలుస్తామన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లను కలిశారు.

Tags:    

Similar News