తమిళనాడు కల్తీసారా ఘటనలో 55కి చేరిన మృతుల సంఖ్య

తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కళ్లకురిచి జిల్లాలో కొంతమంది కల్తీసారా తాగిన విషయం తెలిసిందే.

Update: 2024-06-22 05:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కళ్లకురిచి జిల్లాలో కొంతమంది కల్తీసారా తాగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించి మరో 15 మంది చనిపోవడంతో మొత్తం ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 55కు చేరింది. ఇంకా 88 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ కేసులో నలుగురు అనుమానాస్పద వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్తీసారా దుర్ఘటనపై విచారణను సీబీసీఐడీకి అప్పగించింది. అలాగే జిల్లా పోలీస్ చీఫ్ సమయ్ సింగ్ మీనాను సస్పెండ్ చేసి ఆయన స్థానంలో రజత్ చతుర్వేదిని నియమించింది. కలెక్టర్ శ్రావణ్ కుమార్ జాతావత్ స్థానంలో ఎంఎస్ ప్రశాంత్‌ను నియమించారు.

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రాణ నష్టం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున, తీవ్ర అస్వస్థతకు గురైన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. మద్రాస్ హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్రమత్తంగా లేకపోవడం వల్ల తిరిగి ఇలా జరిగిందని ప్రభుత్వంపై కోర్టు సీరియస్ అయింది. మరోవైపు స్టాలిన్ ప్రభుత్వం విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. అన్నాడీఎంకే అధినేత, పళనిస్వామి అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించారు, కల్తీసారా సమస్యను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు.


Similar News