కూతుళ్లు ఓడిపోయారు.. బ్రిష్ భూషణ్ కుమారుడికి ఎంపీ టికెట్ ఇవ్వడంపై రెజ్లర్ల ఆగ్రహం
ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. దీనిపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. దీనిపై రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రెజ్లర్, ఒలింపిక్ విన్నర్ సాక్షి మాలిక్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ య్యారు. దేశ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా అని ప్రశ్నించింది. ఒక వ్యక్తి ముందు ప్రభుత్వం లొంగిపోయిందా అని నిలదీశారు.
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిన విషయం తెల్సిందే. అయితే, బ్రిజ్ భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కైసర్ గంజ్ నుంచే కరణ్ భూషణ్ సింగ్ బరిలో దిగారు.
ఈ దేశ కూతుళ్లు ఓడిపోయారని.. బ్రిజ్ భూషణ్ గెలిచాడని మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా తామంతా కెరీర్‌లను లెక్కచేయకుండా పోరాడామన్నారు. ఎన్నో రోజులు రోడ్లపైనే నిద్రించామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్ ను ఇంతవరకు అరెస్టు చేయలేదని అన్నారు. న్యాయం తప్ప.. ఇంకేం డిమాండ్ చేయట్లేదన్నారు. అరెస్టు చేయకపోగా.. ఆయన కుమారుడికి ఎననికల్లో టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. కోట్లాది మంది అమ్మాయిల మనోధైర్యాన్ని దెబ్బతీశారని.. బీజేపీని ఉద్దేశిస్తూ మండిపడ్డారు. కేవలం ఒకే ఫ్యామిలీకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే.. ఒక వ్యక్తి ముందు ఈ దేశ ప్రభుత్వం అంత బలహీనపడిందా? అని ప్రశ్నించారు. శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన మార్గంలో నడవరా? అని సాక్షి ప్రశ్నించారు.
కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు బ్రిజ్ భూషణ్. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు రెజ్లర్లు. గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా రెజ్లర్లు ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్టీలో బ్రిజ్ భూషణ్ పై వ్యతిరేకత రాగా.. ఆయనకు ఈసారి టికెట్ నిరాకరించింది బీజేపీ.
బ్రిజ్‌భూషణ్ చిన్న కుమారుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్.. ప్రస్తుతం యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక, మరో కుమారుడు ప్రతీక్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. కరణ్ కుమార్ కు టికెట్ ఇవ్వడంపై బ్రిజ్‌భూషణ్ స్పందిస్తూ.. పార్టీ కంటే ఎవరూ ఎక్కువ కాదని పేర్కొన్నారు.