కచ్‌లో తీరం దాటనున్న 'బైపార్జోయ్'..

బైపార్జోయ్ తుఫాను గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ ఓడరేవు సమీపంలో గురువారం (జూన్ 15న) మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.

Update: 2023-06-12 12:17 GMT

అహ్మదాబాద్: బైపార్జోయ్ తుఫాను గుజరాత్‌లోని కచ్ జిల్లా జఖౌ ఓడరేవు సమీపంలో గురువారం (జూన్ 15న) మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది అతి తీవ్ర తుఫానుగా మారడంతో.. ఆ రోజు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని సోమవారం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలైన కచ్, పోర్‌బందర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బీలలో సముద్రానికి దగ్గరగా నివసించే ప్రజలను అధికారులు ఇళ్ళు ఖాళీ చేయించడం ప్రారంభించారు. దాదాపు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చేపల వేట కార్యకలాపాలను కూడా నిలిపివేశారు.

ఓడరేవుల వద్ద హెచ్చరిక సంకేతాలను ఎగురవేశారు. కచ్ జిల్లాలోని తీర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. జూన్ 15 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జూన్ 15, 16 తేదీల్లో కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలతో పాటు సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. జూన్ 16 వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళొద్దని సూచించింది. మరోవైపు గుజరాత్‌లోని వల్సాద్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, అమ్రేలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది.


Similar News