Odisha: ప్రధాని మోడీ వ్యక్తిగత కార్యదర్శి కుమార్తె పేరుతో మోసం.. ఇద్దరు అరెస్టు
భువనేశ్వర్ లో బిల్డర్లు, వ్యాపారులను దోచుకున్న జంటను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. అడ్డదారిలో కోట్లు కొల్లగొట్టేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కార్యదర్శి పేరునే వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: భువనేశ్వర్ లో బిల్డర్లు, వ్యాపారులను దోచుకున్న జంటను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. అడ్డదారిలో కోట్లు కొల్లగొట్టేందుకు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) కార్యదర్శి పేరునే వాడుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శి పీకే మిశ్రా కుమార్తె, అల్లుడిగా చలామణి అవుతూ పలువురిని మోసం చేసినట్లు వెల్లడించారు. ఒడిశా (Odisha)లోని ప్రముఖ నేతలు, ఉన్నతాధికారులతో దగ్గరి సంబంధాలున్నాయంటూ హన్సితా అభిలిప్సా, అనిల్ మహంతి జంట బిల్డర్లు, వ్యాపారులను మోసగించినట్లు తెలిపారు. భువనేశ్వర్‌లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఒక విలాసవంతమైన కార్యాలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘‘మాకున్న సమాచారం మేరకు హన్సితా, అనిల్.. పీకే మిశ్రా సమీప బంధువులుగా చాలామందిని బురిడీ కొట్టించారు. వారిపై డిసెంబర్ 26న కేసు నమోదైంది’’ అని అడిషనల్ డీసీపీ స్వరాజ్ వెల్లడించారు.
మాయమాటలు చెప్పి..
తమకున్న పరిచయాలతో టెండర్లు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి.. ప్రముఖులతో దిగినట్లు బాధితులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అలా వారినుంచి భారీ మొత్తంలో సొమ్ము గుంజేవారు. అయితే ఈ దంపతుల చేతిలో మోసపోయిన ఓ గనుల వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి దారుణాలు బయటపడ్డాయి. అభిలిప్సా ప్రధానంగా మైనింగ్, నిర్మాణ, ప్రముఖ సంస్థలకు చెందిన ధనవంతులను టార్గెట్ చేసేదని పోలీసులు తెలిపారు. ఈ జంట చేతిలో మోసపోయిన వారు ముందుకొచ్చి ఫిర్యాదు అధికారులు బాధితులను కోరారు.