Cop 29: కాప్-29 సదస్సుకు భారత్ డుమ్మా.. అజర్‌బైజాన్‌లో ప్రారంభమైన సమావేశం
అజర్‌బైజాన్ రాజధాని బాకులో గ్లోబల్ క్లైమేట్ టాక్స్ కాన్ఫరెన్స్ సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
దిశ, నేషనల్ బ్యూరో: అజర్‌బైజాన్ రాజధాని బాకులో గ్లోబల్ క్లైమేట్ టాక్స్ కాన్ఫరెన్స్ (COP-29) సదస్సు మంగళవారం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశానికి భారత్ గైర్హాజరైంది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌లు మీటింగ్ కి హాజరుకాలేదు. పర్యావరణ మంత్రిత్వ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘సదస్సుకు హాజరుకాకపోయినప్పటికీ ఐక్యరాజ్యసమితి, ఇతర బహుపాక్షిక సంస్థల భాగస్వామ్యంతో భారత్ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పర్యావరణానికి సంబంధించి అత్యున్నత స్థాయి భాగస్వామ్యాన్ని విస్తరిస్తుంది’ అని తెలిపింది. అంతేగాక ప్రపంచ వ్యాప్తంగా 13 అతిపెద్ద కార్బన్ ఉద్గారకాలు విడుదల చేసే దేశాల అధినేతలు సైతం ఈ సదస్సుకు హాజరుకాలేదని తెలుస్తోంది. గతేడాది గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల్లో ఈ దేశాల వాటా 70 శాతానికి పైగా ఉంది. అతిపెద్ద కాలుష్య కారకాలు, బలమైన ఆర్థిక వ్యవస్థలైన చైనా, అమెరికాలు సైతం తమ ప్రతినిధులను సమావేశానికి పంపలేదు. అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌లతో సహా దాదాపు 50 మంది నేతలు సదస్సులో ప్రసంగించనున్నారు. కాగా, దుబాయ్ లో జరిగిన కాప్-28 సదస్సుకు భారత్ తరఫున ప్రధాని మోడీ, భూపేందర్ యాదవ్ లు హాజరయ్యారు.