Badlapur sexual assault: క్రాకర్స్ కాల్చేందుకు భయపడే నా కొడుకు తుపాకీ ఎలా కాలుస్తాడు?

మహారాష్ట్రలోని బద్లాపూర్‌ లో బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-09-24 07:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని బద్లాపూర్‌ లో బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్ కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్ కౌంటర్ లో కుట్ర ఉందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, అక్షయ్‌ షిండే ఎన్‌కౌంటర్‌పై అతని తల్లి స్పందించారు. అక్షయ్‌ని చంపడానికి పోలీసులు చెప్పిన కారణాలను ఆమె తోసిపుచ్చారు. ఈ కేసులో కుట్ర జరిగిందని.. అందులో భాగంగానే తన కుమారుడుని పోలీసులు హత్య చేసినట్లు ఆరోపించారు. ‘‘నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర. పోలీసులే నా బిడ్డను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి మేము అంగీకరించము. నా కొడుకు క్రాకర్స్ పేల్చడానికి, రోడ్డు దాటడానికి భయపడేవాడు. అతను పోలీసులపై ఎలా కాల్పులు జరుపుతాడు? అతడిపై ఒత్తిడి పెట్టిన పోలీసులు.. నేరాంగీకార వాంగ్మూలాన్ని కూడా పొందారు. అందులో ఏం రాయించారో అక్షయ్ కే తెలుసు ఒత్తిడితో అతడు రాసిన నేరాంగీకార వాంగ్మూలాన్ని కూడా పొందారు. అతడిని ఏం రాయించాడో, అతడికే తెలుసు’’ అని అక్షయ్ తల్లి చెప్పారు. అక్షయ్‌పై అభియోగాలు రుజువు కాలేదని, ఎప్పుడు విడుదల అవుతాడని అక్షయ్ తనను అడిగేవాడని ఆమె అన్నారు. అక్షయ్ షిండే హత్యపై విచారణ జరిపించాలని ఆయన తండ్రి అన్నా షిండే డిమాండ్ చేశారు. తనను పోలీసులు కొట్టారని, డబ్బు కావాలని చిట్ పంపారని కూడా అక్షయ్ కుటుంబ సభ్యులు చెప్పారు.

ప్రతిపక్షాల విమర్శలు

ఇకపోతే, నిందితుడి మృతిపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ నిందితుడి ఎన్ కౌంటర్ పై ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ నిర్లక్ష్యం కన్పిస్తోందని.. ప్రధాన నిందితుడి ఎన్ కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. మహా సర్కారుపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శలు గుప్పించారు. ముందుగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని.. ఇప్పుడు ప్రధాన నిందితుడ్ని కస్టడీలో చంపారని అన్నారు. ఇదంటా చట్టం అమలు, న్యాయవ్యవస్థను విచ్ఛిన్నం చేయడమే అని మండిపడ్డారు. ఈ చర్య క్షమించరానిదని.. మహారాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతోందని సుప్రియా అన్నారు.

సీఎం ఏమన్నారంటే?

శరద్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జితేంద్ర అవద్ కూడా పోలీసుల చర్యను "నిరాధారం" అని పేర్కొన్నారు. ఐదుగురు పోలీసులు చుట్టుముట్టినప్పుడు చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి తుపాకీని ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమే నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయించటమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. అయితే.. ప్రతిక్షాల ఆరోపణలపై సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం విజయవంతం చేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న మూడు పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయని అన్నారు.


Similar News