MUDA scam: మీరు నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం కూలిపోయింది.. కర్ణాటక సీఎం రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ముడా స్కాంలో హైకోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ముడా స్కాంలో హైకోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. దీంతో, సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ‘మీరు నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. ఇప్పుడు గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి’ అని కన్నడలో బీజేపీ కర్ణాటక విభాగం సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా సిద్ధరామయ్యని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “ముడా కుంభకోణంలో దర్యాప్తును సవాలు చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఇక సిద్ధరామయ్యకు పదవి నుంచి తప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఆర్టీఐ కార్యకర్త టీజే అబ్రహం ఫిర్యాదుపై గవర్నర్ విచారణకు ఆదేశించారు” అని సీఎంని ఎద్దేవా చేశారు.
హైకోర్టులో సిద్ధరామయ్యకు షాక్
ముడా స్కామ్ (MUDA scam) కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆ స్కాంకి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. కాగా.. ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు గతంలో తీర్పుని వాయిదా వేసింది. ఇక, ఇప్పుడు సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు తెలిపింది. గవర్నర్ చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని స్పష్టం చేసింది.
సీఎంపై ఫిర్యాదు
‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందేందుకు.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ అనే ఇద్దరు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులతో సీఎంను విచారించాలంటూ ఆగస్టు 16న గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలు రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా.. దాన్ని గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు చుక్కెదురవ్వడంతో.. రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.