బిహార్‌లో అభ్యర్థులను ప్రకటించిన మహాగట్‌బంధన్.. బరిలో పీకే పార్టీ

బిహార్‌లో వచ్చే నెల 13వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ఆ రాష్ట్రంలోని విపక్ష కూటమి అభ్యర్థులను ప్రకటించింది.

Update: 2024-10-20 11:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో వచ్చే నెల 13వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి ఆ రాష్ట్రంలోని విపక్ష కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీలు గెలిచిన నలుగురు తమ శాసన సభ స్థానాలకు రాజీనామా చేయడంతో రాంగడ్, తరారీ, బేలాగంజ్, ఇమామ్‌గంజ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్ ప్రతిపక్ష కూటమి అయిన మహాగట్ బంధన్ నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. రాంగడ్ నుంచి ఆర్జేడీ అభ్యర్థి అజిత్ కుమార్ సింగ్, బేలాగంజ్ నుంచి ఆర్జేడీ నేత విశ్వనాథ్ యాదవ్, తరారీ నుంచి సీపీఎంఎల్ అభ్యర్థి రాజు యాదవ్, ఇమామ్‌గంజ్ నుంచి ఆర్జేడీ నేత రాజేశ్ మాంఝీలను తమ అభ్యర్థులుగా వెల్లడించింది.

మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ నెల 2వ తేదీన ప్రకటించిన రాజకీయ పార్టీ జన్ సురాజ్ కూడా ఈ ఉపఎన్నికలో పోటీ చేయనుంది. ఎన్నికల రాజకీయాల్లో తన బలాన్నీ ఈ పార్టీ పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఎన్డీయే కూటమి రెండు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. రాంగడ్ నుంచి మాజీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ సింగ్‌ను, తరారీ నుంచి విశాల్ ప్రశాంత్‌ను బరిలో దింపుతున్నది.

Tags:    

Similar News