Privilege Motion: ప్రధానికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్

లోక్‌సభలో కులాల గురించి జరిగిన రగడలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి మద్దతు పలికారు.

Update: 2024-07-31 10:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో కులాల గురించి జరిగిన రగడలో ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రసంగానికి మద్దతు పలికారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కాగా.. ఈ విషయంలో మోడీకి వ్యతిరంగా ప్రివిలేజ్‌ మోషన్‌ను కాంగ్రెస్‌ తీసుకువచ్చింది. కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జిత్ సింగ్ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు. లోక్‌సభలో కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మధ్య కులం గురించి చర్చ జరిగింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షం.. అనురాగ్ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో, సభలో గందరగోళం జరిగింది.

అనురాగ్ కు మోడీ మద్దతు

కాగా, లోక్‌సభలో అనురాగ్‌ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘ యంగ్, ఎనర్జిటిక్ సహోద్యోగి అనురాగ్‌ ఠాకూర్‌ చేసిన ఈ స్పీచ్ తప్పకుండా వినాలి. వాస్తవాలు, హాస్యంతో కలగలిసిన ఈ వీడియో.. ఇది ‘ఇండియా’ కూటమి డర్టీ రాజకీయాలను బట్టబయలు చేస్తుంది’ అని అన్నారు. అయితే, లోక్ సభకు సంబంధించిన వివాదాస్పద వీడియో క్లిప్ ను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేయడంపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది. మోడీ పార్లమెంటరీ ప్రత్యేకాధికారాలను తీవ్రంగా ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ ని తీసుకొచ్చింది.


Similar News