కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకబడిన తరగతులకు వ్యతిరేకం: అమిత్ షా

కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ వెనుకబడిన తరగతులకు వ్యతిరేకమని ఆరోపించారు.

Update: 2024-07-16 10:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ వెనుకబడిన తరగతులకు వ్యతిరేకమని ఆరోపించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో జరిగిన 'వెనుకబడిన తరగతుల సమ్మాన్ సమ్మేళన్'లో అమిత్ షా ప్రసంగిస్తూ, ఇతర వెనుకబడిన తరగతులకు (OBCలు) రిజర్వేషన్లు కల్పించేందుకు 1950లలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు, కాంగ్రెస్ సంవత్సరాల తరబడి దాని సిఫార్సులను అమలు చేయలేదని అన్నారు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ మండల్ కమిషన్‌ను కోల్డ్ స్టోరేజీలో పెట్టారు. 1990లో, దానిని ఆమోదించినప్పుడు, రాజీవ్ గాంధీ రెండున్నర గంటల పాటు ప్రసంగించి OBC రిజర్వేషన్‌ను వ్యతిరేకించారని ఆయన అన్నారు.

కర్ణాటకలో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కొని ముస్లింలకు ఇచ్చింది, వారు హర్యానాలో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా అదే జరుగుతుందని అమిత్ షా అన్నారు. హర్యానాలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతించబోమని హామీ ఇస్తున్నాను, రాబోయే ఎన్నికల్లో హర్యానాలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివర్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ అమిత్‌షా విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత పదిహేను రోజుల్లో ఆయన హర్యానాలో పర్యటించడం ఇది రెండోసారి. అంతకుముందు జూన్ 29న పంచకులలో జరిగిన పార్టీ విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి అమిత్‌షా ప్రసంగించారు.


Similar News