Congress guarantees: రూ.25లక్షల బీమా, వడ్డీ లేని రుణాలు.. జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు

కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే హామీల వివరాలను వెల్లడించారు.

Update: 2024-09-11 12:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం హామీల వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ లోని ప్రతి కుటుంబానికీ రూ.25లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు రూ.3,000 ఇస్తామని తెలిపారు. అంతేగాక మహిళలకు రూ.5లక్షల వడ్డీ లేని రుణం, కశ్మీర్ పండిట్లకు పునరావాసం కల్పించడం, రేషన్ షాపుల ద్వారా ప్రతి వ్యక్తికి 11 కిలోల బియ్యం అందజేస్తామని ప్రకటించారు.

అనంతరం అనంతనాగ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని తెలిపారు. బీజేపీ గతంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ ఎన్నికల ప్రచారాల్లో అనేక ప్రసంగాలు చేస్తుందని, కానీ వారి మాటలకు, కార్యాచరణకు మధ్య చాలా తేడా ఉంటుందన్నారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్, ఎన్సీ కూటమి విజయాన్ని ఆపలేదని చెప్పారు. కశ్మీర్ యువతకు 5లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ఆశచూపుతోందని, కానీ అది ఒక బూటకపు వాగ్దానమని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాట ఇచ్చారని పదేళ్లు గడిచినా ఆ ఉద్యోగాలు రాలేదన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజల పక్షాన నిలిచిన కాంగ్రెస్‌ ఎన్సీ కూటమికి మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయని, వీటన్నింటినీ పట్టించుకోకుండా మోడీ మాత్రం అబద్దాలు చెబుతూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటామని అదే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. కాగా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 18, 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. 


Similar News