అమిత్ షాపై ఎఫ్ఐఆర్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు

Update: 2023-04-27 14:10 GMT

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ కాంగ్రెస్ నేతలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేలేనిపోని గొడవలు జరుగుతాయని, ఆ పార్టీకి ఓట్లు వెయ్యకూడదని బెళగావిలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా బెదిరింపు ధోరణిలో కామెంట్ చేశారని ఆరోపించారు. ఈమేరకు కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సూర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్ బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రతిపక్షాలను కించపరిచేలా, రెచ్చగొట్టేలా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.

బెళగావిలో బీజేపీ సభను నిర్వహించిన వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు మేరకు అమిత్ షా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. " అమిత్ షాపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక సామాన్యుడు అదే కామెంట్స్ చేసి ఉంటే ఇప్పటికి అరెస్ట్ చేసి ఉండేవారు. అమిత్ షా వ్యాఖ్యల వ్యవహారంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం. ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేయకున్నా నాపై 20కి పైగా కేసులు బనాయించారు" అని డీకే శివకుమార్ అన్నారు. "ఈ అసెంబ్లీ పోల్స్ లో కర్ణాటకలో బీజేపీకి 40కి మించి సీట్లు రావని తేలిపోయింది.

ఆ నిరాశలో కూరుకుపోయిన బీజేపీ లీడర్లు ఏది పడితే అది మాట్లాడుతున్నారు " అని రణదీప్  సింగ్ సూర్జేవాలా  పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్లు 153 ఏ, 171జీ , 505 (2), 123 కింద అమిత్ షా పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించామని వెల్లడించారు. కర్ణాటకలో మే 10న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 13న ఫలితాలను వెల్లడించనున్నారు. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్‌‌కు 75 మంది, జేడీఎస్‌కు 28 మంది సభ్యులుండగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి.

Tags:    

Similar News