Kuki Militants : నూటికి నూరు శాతం కరెక్టే.. మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి కుకీ మిలిటెంట్ల చొరబాటు నిజమే : ప్రభుత్వ అడ్వైజర్
దిశ, నేషనల్ బ్యూరో : మయన్మార్‌లో సాయుధ శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లోకి చొరబడ్డారా ?
దిశ, నేషనల్ బ్యూరో : మయన్మార్‌లో సాయుధ శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మణిపూర్‌లోకి చొరబడ్డారా ? వాళ్లే భారత భద్రతా బలగాలపై, ప్రత్యర్థి వర్గాలపై డ్రోన్ దాడులు చేస్తున్నారా ? అనే దానిపై తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆ విషయం నూటికి నూరు శాతం నిజమేనని మణిపూర్ ప్రభుత్వ భద్రతా సలహాదారుడు కులదీప్ సింగ్ అధికారికంగా ఒప్పుకున్నారు. ‘‘కుకీ మిలిటెంట్లు మయన్మార్‌లో ట్రైనింగ్ తీసుకొని మణిపూర్‌లోకి చొరబడ్డారు. దీనిపై భారత నిఘా వర్గాల నుంచి రహస్య సమాచారం అందింది. దాన్ని మేం పెడచెవిన పెట్టలేం. తప్పకుండా అలర్ట్‌గా ఉంటాం’’ అని ఆయన తెలిపారు.
ఈ ఇంటెలీజెన్స్ సమాచారం అందిన వెంటనే మణిపూర్ - మయన్మార్ సరిహద్దుల్లోని అన్ని జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు అందరికి పంపారని తెలిసింది. కుకీ మిలిటెంట్లు డ్రోన్ల ద్వారా బాంబులు వేయడం, మిస్సైళ్లు వేయడం, అడవుల్లో గెరిల్లా పోరాటం చేయడం వంటివన్నీ మయన్మార్‌లో నేర్చుకున్నారని సమాచారం. చెరో 30 మంది చొప్పున ప్రస్తుతం కుకీ మిలిటెంట్లకు చెందిన 30 గ్రూపులు మణిపూర్ వ్యాప్తంగా దాక్కున్నాయని అంటున్నారు. ఈనెలాఖరులోగా మెయితీ వర్గం అత్యధికంగా ఉండే గ్రామాల ప్రజలు లక్ష్యంగా కుకీ మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.