Modi: దేశాన్ని విభజించే వారు గణేశ్ పూజను వ్యతిరేకిస్తున్నారు.. కాంగ్రెస్ పై మోడీ విమర్శలు

సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో పాల్గొనడంపై ప్రధాని మోడీ స్పందించారు.

Update: 2024-09-17 10:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో పాల్గొనడంపై ప్రధాని మోడీ స్పందించారు. దేశాన్ని విభజించేవారు గణపతి పూజను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. ‘గణేశ్‌ ఉత్సవం కేవలం పండుగ కాదని.. దేశ స్వాతంత్ర్యపోరాటం వేళ చారిత్రాత్మకంగా కీలక పాత్ర పోషించింది. గణేశ్‌ పూజ ద్వారానే లోకమాన్య తిలక్‌ దేశ ప్రజలను ఐక్యం చేశారు. ఇప్పుడు కూడా ఆ పూజ ఉందంటే.. అన్నివర్గాల ప్రజలు పాల్గొంటారు. అప్పట్లో కూడా విభజించి పాలించు అనే విధానాన్ని అనుసరించిన బ్రిటీష్ వారు గణేష్ ఉత్సవాన్ని అసహ్యించుకునేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అధికార దాహంతో ఉన్నవారు విభజించు, పాలించు నినాధాన్ని అనుసరింస్తున్న వారు గణేశ్ పూజతో ఇబ్బంది పడుతున్నారు. నేను గణేశ్‌ పూజలో భాగమయ్యే సరికి కాంగ్రెస్‌, ఆ పార్టీ వ్యవస్థ చిరాకు పడుతోంది.’’ అని మోడీ అన్నారు. కర్ణాటకలో వినాయకుడి విగ్రహాన్ని జైల్లో పెట్టారని గుర్తుచేశారు. ఇలాంటి విద్వేషం దేశానికి ప్రమాదకరమన్నారు. గణేష్ పూజపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు.. దేశాన్ని విభజించాలనే వారి ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. అలాంటి విభజన శక్తులకు మద్దతు ఇవ్వొద్దని ప్రజలను కోరారు.

అసలేం జరిగిందంటే?

ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నివాసంలో నిర్వహించిన గణపతి పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) పాల్గొన్నారు. సీజేఐ ఇంటికి మోడీ వెళ్లడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవస్థలపై వదంతులు చెలరేగే పరిస్థితులను సృష్టించడం సరి కాదని ప్రతిపక్షాలు నొక్కిచెప్పాయి. రాజ్యాంగ రక్షకులను రాజకీయ నేతలు కలవడం ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోందని వ్యాఖ్యానించాయి. మరోవైపు, బెంగళూరులో వినాయక విగ్రహాన్ని పోలీసు వ్యాన్ లో తరలించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీనిపైనే ప్రధాని మోడీ సహా బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అయితే, కోర్టు ఆదేశాలను ధిక్కరించి నిరసనలు చేపట్టారని.. ఆ సమయంలో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని వ్యాన్ లో పెట్టామని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అధికారుల సమక్షంలో సంప్రదాయం ప్రకారం గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేశామన్నారు.


Similar News