ఆయుష్మాన్ భారత్ ఆసుపత్రుల వెరిఫికేషన్‌ను త్వరగా పూర్తి చేయండి: NHA
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయిన హాస్పిటల్స్ వెరిఫికేషన్‌ను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) తాజాగా రాష్ట్ర మిషన్ డైరెక్టర్‌లను (SMD) ఆదేశించింది.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయిన హాస్పిటల్స్ వెరిఫికేషన్‌ను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) తాజాగా రాష్ట్ర మిషన్ డైరెక్టర్‌లను (SMD) ఆదేశించింది. ఈ స్కీమ్ కింద నమోదు చేయాలంటే ఆయా హాస్పిటల్‌లో ఆరోగ్య సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు ధృవీకరించాల్సి ఉంది. హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఇంకా 23,954 ఆరోగ్య సౌకర్యాలను ధృవీకరించాల్సి ఉంది. వెరిఫికేషన్‌ల కోసం అత్యధిక ఆరోగ్య సదుపాయాలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రాలు.. మహారాష్ట్ర (5,351), ఉత్తరప్రదేశ్ (5,212), మధ్యప్రదేశ్ (1,964), ఆంధ్రప్రదేశ్ (1,868), రాజస్థాన్ (1,840).
హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ అనేది దేశంలోని అన్ని వైద్య వ్యవస్థలలో ఆరోగ్య సౌకర్యాల సమగ్ర డేటాను కలిగి ఉంటుంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి రాష్ట్ర మిషన్ డైరెక్టర్‌లు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం రెండు డిస్ట్రిక్ట్ వెరిఫైయర్‌లను, ఒక జిల్లా నోడల్ అధికారి నియమించాలని నేషనల్ హెల్త్ అథారిటీ సూచించింది. ఇప్పటి వరకు, 310,345 ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ క్రింద ధృవీకరించబడ్డాయి, వీటిలో 122,260 ప్రైవేట్, 188,085 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయి.