పంజాబ్‌లో కలకలం..రెండు చైనా డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

పంజాబ్‌లో చైనా డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. అమృత్‌సర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు చైనా డ్రోన్లను బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

Update: 2024-04-22 03:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్‌లో చైనా డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. అమృత్‌సర్ ప్రాంతంలోని వేర్వేరు ప్రదేశాల్లో రెండు చైనా డ్రోన్లను బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇంటలిజెన్స్ సమాచారం ఆధారంగా బీఎస్ఎఫ్ దళాలు, పంజాబ్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా అనుమానిత ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే అమృత్‌సర్ జిల్లాలోని హర్డో రట్టన్, గ్రామ డాక్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాల్లో రెండు డ్రోన్లు పట్టుబడ్డాయి. మధ్యాహ్నం 12:15నిమిషాలకు ఒక డ్రోన్, ఆ తర్వాత 2గంటలకు మరొక డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్‌లను చైనా తయారు చేసిన డీజేఐ మావిక్ 3 క్లాసిక్‌గా గుర్తించారు.

అంతకుముందు ఫిరోజ్‌పూర్ జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి మూడు హెరాయిన్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న డ్రోన్‌ను సైతం బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో డ్రోన్‌తో పాటు సరుకు ఉన్నట్లు బీఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. దీంతో వేగంగా స్పందించిన బీఎస్ఎఫ్ బలగాలు అనుమానిత ప్రాంతంలో విస్తృతంగా సోదాలు నిర్వహించి డ్రోన్‌ను పట్టుకున్నాయి. చండీగఢ్‌కు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని నేస్తా గ్రామానికి ఆనుకుని ఉన్న పొలాల్లో దీనిని పట్టుకున్నారు.

కాగా, డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకోవడంలో బీఎస్ఎఫ్ విజయవంతంగా పనిచేస్తోంది. గతేడాది 107 డ్రోన్లను బీఎస్ఎఫ్ దళాలు గుర్తించి కాల్చి వేశాయి. సుమారు 442కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్లతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనూ ఫిరోజ్ పూర్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉంచడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. 

Tags:    

Similar News