‘నా అంతిమ యాత్రకైనా రండి’.. అల్లుడి తరఫున ప్రచారంలో ఖర్గే ఎమోషనల్
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబురగిలో అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి తరఫున ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమోషనల్ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటకలోని తన సొంత జిల్లా కలబురగిలో అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణి తరఫున ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమోషనల్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి ఓటువేసినా, వేయకున్నా.. నేను మీ కోసం పనిచేశానని భావిస్తే కనీసం నా అంతిమ యాత్రకైనా రండి’’ అని ఆయన ఓటర్లను కోరారు. బుధవారం కలబురగి జిల్లాలోని అఫ్జల్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో 81 ఏళ్ల మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ.. ‘‘మీరు ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకపోతే.. కలబురగిలో నాకు ఇక చోటు లేదని భావిస్తా. మీ మనసులను నేను గెలవలేకపోయానని అనుకుంటా’’ అని పేర్కొన్నారు. కలబురగి లోక్‌సభ స్థానం నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఇక్కడి బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉమేష్ జాదవ్‌నే మరోసారి బీజేపీ బరిలోకి దింపింది.
తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతా
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో కొనసాగుతానని ఖర్గే స్పష్టం చేశారు. ‘‘దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నా చివరి శ్వాస వరకు కృషి చేస్తాను. రాజకీయాల నుంచి విరమించుకోను’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘నేను బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను ఓడించేందుకు పుట్టాను తప్ప వారి ముందు లొంగిపోవడానికి కాదు’’ అని తెలిపారు. ఈ సూత్రాలను పాటించాలని తనతో వేదికను పంచుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఖర్గే సూచించారు.