యూపీలో బాలికపై తోడేలు దాడి.. చివరి ప్రయత్నంగా కాల్చండి: సీఎం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దాదాపు 50,000 మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేళ్ళ గుంపులో నాలుగింటిని పట్టుకోగా, మరో రెండు పరారీలో ఉన్నాయి.

Update: 2024-09-03 10:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో దాదాపు 50,000 మంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న తోడేళ్ళ గుంపులో నాలుగింటిని పట్టుకోగా, మరో రెండు పరారీలో ఉన్నాయి. అయితే ఇవి జిల్లాలోని దాదాపు 25 నుంచి 30 గ్రామాల్లో తిరుగుతూ స్థానికులను చంపేస్తున్నాయి. తాజాగా గిర్‌ధార్‌పూర్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి సమయంలో తన అమ్మమ్మ పక్కన నిద్రిస్తున్న ఐదేళ్ల బాలికపై ఒక తోడేలు దాడి చేసింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు మేల్కొని తోడేలుపై దాడి చేయడంతో అక్కడి నుంచి పారిపోయింది.

ఈ ఘటనలో బాలిక ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, స్వల్పంగా గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. తమ గ్రామానికి తోడేలు రావడం ఇదే తొలిసారి అని బాలిక బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే, తోడేళ్ళ దాడుల్లో మొత్తం 34 మంది గాయపడ్డారు. అంతకుముందు బహ్రైచ్ ప్రాంతంలో ఆరుగురు పిల్లలు, ఒక మహిళతో సహా ఎనిమిది మంది వ్యక్తులను తోడేళ్ళ గుంపు చంపాయి. బహ్రైచ్ జిల్లా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోజు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.

తోడేళ్ళ గుంపును పట్టుకోవడానికి 16 బృందాలతో 'ఆపరేషన్ భేదియా'ను గతంలో ప్రారంభించారు. ఇప్పటి వరకు నాలుగింటిని పట్టుకోగా, మరో రెండింటిని పట్టుకోవడానికి సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. తోడేళ్ళ దాడుల నేపథ్యంలో సీఎం ఆదిత్యనాథ్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీనియర్ అటవీ అధికారుల ప్రభావిత ప్రాంతాల్లో విడిది చేసి స్వయంగా పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. అటవీ, పోలీస్, స్థానిక పరిపాలన, పంచాయతీ, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చూసుకుని వాటిని తొందరగా పట్టుకోవాలని, చివరి ప్రయత్నంగా మాత్రమే కాల్చాలని సీఎం ఆదేశించారు.


Similar News