12వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు: సీబీఎస్ఈ కొత్త విధానం

ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు అందజేసినట్టు అవుతుందని కేంద్రం భావిస్తోంది.

Update: 2024-07-17 11:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థులపై అకడమిక్ ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)ని కేంద్రం కోరింది. ఈ కొత్త పరీక్షా విధానం 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై స్పష్టత వచ్చిన తర్వాత ఏడాదిలో మార్చి, జూన్‌లలో రెండుసార్లు నిర్వహించవచ్చని జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు అందజేసినట్టు అవుతుందని కేంద్రం భావిస్తోంది. ఇటీవల పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సీబీఎస్ఈ చేపట్టిన చర్చల్లో సెమిస్టర్ విధానంపై ఏకాభిప్రాయం కుదరలేదు, ఇప్పుడున్న తరహాలోనే మార్చిలోనే బోర్డు పరీక్ష పెట్టి, మళ్లీ జూన్‌లో మరో అవకాశం ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కేంద్ర విద్యా శాఖకు పంపినట్టు సమాచారం. ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి-మార్చిలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. మే నెలలో ఫలితాలు వెలువడ్డాక, సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతిస్తున్నారు. కొత్త విధానం అమలైతే.. మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు మళ్లీ అన్ని పరీక్షలను జూన్‌లో రాసేందుకు అనుమతిస్తారు. ఇది పూర్తిగా ఆప్షనల్‌గా ఉంటుందని, తప్పనిసరి కాదని తెలుస్తోంది. ఉత్తమ స్కోర్ సాధించేందుకు కల్పించే అవకాశంలా ఇది ఉంటుంది. కాగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. 


Similar News