Udaipur palace: ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఉద్రిక్తతలు.. మేవాడ్ మహారాజుకు 'నో' ఎంట్రీ
రాజస్థాన్ (Rajasthan)లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మేవాడ్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం జరిగింది.
దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ (Rajasthan)లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మేవాడ్ రాజవంశంలో కొత్త మహారాజు పట్టాభిషేకం జరిగింది. మేవాడ్ 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ పేరుని ప్రకటించారు. కాగా.. విశ్వరాజ్ సింగ్, ఆయన అనుచరులు ఉదయ్ పూర్ ప్యాలెస్ లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు. దీంతో, ఇరు వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు జరిగాయి. పలువురికి గాయాలయ్యాయి. మేవాడ్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఘర్షణ చెలరేగింది.
అసలేం జరిగిందంటే?
కాగా.. మేవాడ్ 76వ మహారాజు (Maharana of Mewar)గా ఉన్న మహేంద్రసింగ్ ఇటీవలే కన్నుమూశారు. దీంతో, 77వ మహారాజుగా మహేంద్ర సింగ్ కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే విశ్వరాజ్ సింగ్ మేవాడ్ (BJP MLA Vishvaraj Singh Mewar)కు సోమవారం పట్టాభిషేకం చేశారు. చిత్తోర్‌గఢ్ కోటలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత, సంప్రదాయం ప్రకారం కులదైవం ఏకలింగనాథ్ ఆలయం, ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్ లోని ధూని మాత ఆలయాన్ని కొత్త మహారాజు సందర్శించాల్సి ఉంది. అయితే, ఈ పట్టాభిషేకంపై ఆగ్రహంగా ఉన్న అరవింద్ సింగ్.. కొత్త రాజుకు వ్యతిరేకంగా ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఈయన ఉదయ్‌పుర్‌లోని రాజ కుటుంబానికి చెందిన ట్రస్ట్‌కు ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా అరవింద్ ఉన్నారు. ప్యాలెస్, ఏకలింగనాథ్ ఆలయం అరవింద్ నియంత్రణలోనే ఉండటంతో.. మహారాజు విశ్వరాజ్ సింగ్‌ను కోటలోకి రానివ్వబోమంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలతో ముందుజాగ్రత్త చర్యగా ప్యాలెస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈక్రమంలోనే నిన్న రాత్రి నూతన మహారాజు విశ్వరాజ్ సింగ్, తన మద్దతుదారులతో కలిసి కోట వద్దకు వెళ్లారు. కానీ, అరవింద్ సింగ్ కుమారుడు, ఆయన వర్గం వీరిని లోనికి రాకుండా అడ్డుకుంది. దీంతో విశ్వరాజ్ మద్దతుదారులు బారికేడ్లను దాటుకొని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్ల దాడికి ప్రయత్నించగా.. పలువురు గాయపడ్డారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.