భారత విదేశాంగ కార్యదర్శిగా విక్రమ్ మిస్రీని నియమిస్తూ కేంద్రం నిర్ణయం
ప్రస్తుతం ఉన్న వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ కార్యదర్శిగా దేశ డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ) విక్రమ్ మిస్రీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న వినయ్ క్వాత్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. వినయ్ క్వాత్రా పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 30న ముగిసింది. కానీ, ఆయన పదవీ కాలాన్ని జూలై 14 వరకు కేంద్రం పొడిగించింది. జూలై 15న విక్రమ్ మిస్రీ బాధ్యతలు తీసుకుంటారని కేంద్రం జారీ చేసిన నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. విక్రమ్ మిస్రీ ముగ్గురు ప్రధాన మంత్రులకు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసిన అరుదైన ఘనత కలిగిన ఉండటం విశేషం. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) 1989 బ్యాచ్ అధికారి అయిన ఆయనకు, చైనా రాయబారిగా చేసిన అనుభవం ఉంది. భారత్‌కు విదేశాంగ విధానంలో సవాలుగా నిలిచిన చైనాపై ఆయనకున్న నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విదేశాంగ కార్యదర్శిగా సరిపోతారని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. 1964, నవంబర్ 7న శ్రీనగర్‌లో జన్మించిన విక్రమ్ మిస్రీ ఢిల్లీలోని హిందూ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు. ఎంబీఏ చేసిన ఆయన సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ముందు అడ్వర్టైజింగ్, యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్‌లో పనిచేశారు. ఫ్రెంచ్ భాషలోనూ ఆయనకు పరిజ్ఞానం ఉంది. గత డిసెంబర్ వరకు విక్రమ్ మిస్రీ చైనాలో రాయబారిగా పనిచేశారు.