Chardham Yatra: గంగోత్రి, యుమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాల మూసివేత

శీతాకాలం రావడంతో చార్‌ధామ్(Chardham Yatra) ఆలయాలు మూతపడుతున్నాయి.

Update: 2024-11-02 12:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శీతాకాలం రావడంతో చార్‌ధామ్(Chardham Yatra) ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్(Gangotri) తలుపులను మూసివేయగా.. ఆదివారం యమునోత్రి, కేదార్‌నాథ్ ఆలయాలను మూసివేయనున్నారు. ఈ ఏడాది మే 10న ప్రారంభం అయిన చార్‌ధామ్ యాత్ర ముగింపు దశకు చేరుకుంది. శీతాకాలం రావడంతో అక్కడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్(Kedarnath), బద్రీనాథ్(Badrinath) నాలుగు ఆలయాలను 6 నెలల పాటు మూసి వేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర చివరి దశకు చేరుకోగా.. ఈ నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రి ధామ్ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేశారు. ఆ తర్వాత ముఖ్బాలోని గంగా ఆలయంలో గంగోత్రి మాత దర్శనాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటలకు యమునోత్రి ధామ్ తలుపులను మూసివేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

శీతాకాలపు విడిదికి..

దీపోత్సవంతో గంగోత్రి ధామ్ తలుపుల మూసివేత ప్రక్రియను మొదలుపెట్టినట్లు పంచ గంగోత్రి ఆలయ కమిటీ కార్యదర్శి సురేష్ సెమ్వాల్ చెప్పారు. ఆ తర్వాత గంగామాత ఉత్సవ విగ్రహంతో డోలీ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. శీతాకాలపు విడిదికి గంగామత ఉత్సవ విగ్రహాన్ని తీసుకువస్తామని తెలిపారు. మరోవైపు.. యమునోత్రి ధామ్‌ తలుపులు మూసివేసేందుకు కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం యమునోత్రి ధామ్ మూసివేసిన తర్వాత యమునా దేవి ఉత్సవ విగ్రహాన్ని ఖర్సాలీలోని దేవాలయానికి తీసుకురానున్నారు. చార్‌ధామ్‌లో కీలకమైన కేదార్‌నాథ్‌ ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన ఉదయం 8.30 గంటలకు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక విష్ణువు కొలువైన బద్రీనాథ్‌ ధామ్‌ను నవంబర్‌ 17వ తేదీన రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు. ఇక ఈ ఏడాది చార్‌ధామ్ యాత్ర సందర్భంగా శుక్రవారం సాయంత్రం వరకు 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ప్రతీ ఏడాది దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శీతాకాలంలో చార్ ధామాలు మంచుతో కప్పబడి ఉండటంతో ఆ సమయంలో మూసివేసి.. తిరిగి వేసవిలో మళ్లీ ఈ ఆలయాల తలుపులను తెరవనున్నారు.

Tags:    

Similar News