Pragyan : చంద్రుడిపై 160 కి.మీ వెడల్పున్న భారీ బిలం.. ఇస్రోకు వీడియో ఫుటేజీ పంపిన ‘ప్రజ్ఞాన్’

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌కు విశ్వఖ్యాతిని సాధించిపెట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ ఇంకా జాబిల్లిపై తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది.

Update: 2024-09-22 16:42 GMT

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌కు విశ్వఖ్యాతిని సాధించిపెట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ ఇంకా జాబిల్లిపై తన ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది. టెక్నికల్‌గా ఈమిషన్ 2023లోనే ముగిసినప్పటికీ.. తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ ఓ కీలకమైన సమాచారాన్ని ఇస్రోకు పంపింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో తాను ల్యాండ్ అయిన ప్రదేశంలో చక్కర్లు కొట్టిన ‘ప్రజ్ఞాన్’ .. 160 కిలోమీటర్ల వెడల్పున్న ఓ భారీ ప్రాచీన బిలాన్ని గుర్తించింది. ఈ సీన్‌ను తన హై రెజెల్యూషన్ కెమెరాల్లో బంధించి ఇస్రోకు చేరవేసింది. ఈమేరకు వివరాలతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఇస్రో అనుబంధ సంస్థ ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు రూపొందించిన నివేదికను ‘సైన్స్ డైరెక్ట్’ జర్నల్‌ ప్రచురించింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉన్న ఐట్కెన్ బేసిన్ వద్ద ఒక భారీ బిలం ఉంది. దాని నుంచి దాదాపు 350 కిలోమీటర్ల దూరంలో 160 కి.మీ వెడల్పున్న ఇంకో బిలం ఉందని తాజాగా ‘ప్రజ్ఞాన్’ గుర్తించింది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న అతి ప్రాచీన బిలాల్లో ఈ బిలం కూడా ఒకటని సైంటిస్టులు విశ్లేషించారు. చంద్రుడి భౌగోళిక చరిత్రను తెలుసుకునే దిశగా జరుగుతున్న పరిశోధనలకు ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.


Similar News