Pakistan : రూ.58వేల కోట్లు భారత్‌నే పాక్ అడిగి ఉండాల్సింది : రాజ్‌నాథ్

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు పేల్చారు.

Update: 2024-09-22 14:36 GMT

దిశ, నేషనల్ బ్యూరో : పాకిస్తాన్‌పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు పేల్చారు. ‘‘దివాలా నుంచి బయటపడేందుకు రూ.58వేల కోట్లు కావాలని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)ను పాకిస్తాన్ ప్రాధేయపడుతోంది. ప్రధాని మోడీ అంతకంటే ఎక్కువ మొత్తాన్నే జమ్మూకశ్మీర్ పీఎఫ్ ప్యాకేజీ కోసం ఇచ్చారు’’ అని ఆయన వెల్లడించారు. ‘‘రూ.58వేల కోట్ల సాయం కావాలని ఐఎంఎఫ్‌ను పాక్ బతిమిలాడుతోంది. వాళ్లు భారత్‌నే ఆ సాయం అడిగి ఉండాల్సింది’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘‘పాకిస్తాన్ కొన్ని విషసర్పాలను పెంచి పోషించింది. వాటి వల్లే ప్రస్తుత దీన స్థితికి పతనమైంది’’ అని విమర్శించారు. జమ్మూలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో భారత రక్షణమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమితోనే ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యమని పాకిస్తాన్ రక్షణ మంత్రి అంటున్నారు. పాకిస్తాన్ బినామీలుగా పనిచేస్తున్నారా అని నేను ఈ వేదిక నుంచి కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలను ప్రశ్నిస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత్ లక్ష్యంగా ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద సంస్థలను కట్టడి చేస్తేనే పాకిస్తాన్‌‌తో శాంతియుత సంబంధాలను నెరపడం సాధ్యమవుతుందన్నారు. కశ్మీరియత్, మానవత్వం, ప్రజాస్వామ్యం గురించి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పదేపదే చెబుతుండేవారని ఆయన గుర్తు చేశారు.


Similar News