Grenade Blast : హర్యానా ఎన్నికల వేళ.. చండీగఢ్‌లో పేలిన గ్రెనేడ్

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ చండీగఢ్‌లో బుధవారం సాయంత్రం గ్రెనేడ్ పేలుడు సంభవించింది.

Update: 2024-09-11 15:44 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హర్యానా అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన వేళ చండీగఢ్‌లో బుధవారం సాయంత్రం గ్రెనేడ్ పేలుడు సంభవించింది. నగరంలోని ఓ ప్రవాస భారతీయుడి(ఎన్ఆర్ఐ) ఇంటికి సమీపంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గ్రెనేడ్ పేలడానికి కొన్ని నిమిషాల ముందు ముగ్గురు అనుమానిత వ్యక్తులు ఆటోలో ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్లారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు దూరం దాకా వినిపించిందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీన్లతో కూడిన 30 సెకన్ల సీసీటీవీ ఫుటేజీని సమీపంలోని మరో ఇంటి నుంచి పోలీసులు సేకరించారు. ఆ వీడియోలో సరిగ్గా 14వ సెకను వద్ద పేలుడు శబ్దం వినిపించింది.

సంఘటనా స్థలానికి పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిపుణులు చేరుకొని సాక్ష్యాధారాలను సేకరించారు. పేలుడుకు ఎలాంటి పదార్థాలను వాడారు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చండీగఢ్ పొరుగునే ఉన్న మొహాలీ నగరంలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. చండీగఢ్‌లో గ్రెనేడ్ పేల్చిన వ్యక్తులు మొహాలీలో ఆశ్రయం పొంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేయాలని మొహాలీ పరిధిలోని అన్ని చెక్ పాయింట్లు, పెట్రోలింగ్ యూనిట్లకు పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.


Similar News