‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’కు ఆ లైసెన్స్ రద్దు.. ఈ సంస్థ దాతలెవరంటే?
దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేసే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’పై కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : ప్రభుత్వ విధానాలపై అధ్యయనం చేసే స్వచ్ఛంద సంస్థ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’పై కేంద్ర సర్కారు చర్యలు తీసుకుంది. చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందనే అభియోగాలు రావడంతో సంస్థకు ఉన్న ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. కేంద్ర హోం శాఖ అధికార వర్గాలు ఈవివరాలను బుధవారం వెల్లడించాయి. ఎఫ్‌సీఆర్‌ఏ కింద ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’కు ఉన్న రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసిన దాదాపు ఏడాది తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఈ సంస్థకు చెందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్‌నున 180 రోజుల పాటు సస్పెండ్ చేస్తూ 2023 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ తర్వాత సస్పెన్షన్‌ను మరో 180 రోజుల పాటు పొడిగించారు. తాజాగా బుధవారం రిజిస్ట్రేషన్‌ను పూర్తి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 1973 సంవత్సరం నుంచి దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ సంస్థకు విరాళాలు అందించే దాతల జాబితాలో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, హ్యూలెట్ ఫౌండేషన్, వరల్డ్ బ్యాంక్, ఫోర్డ్ ఫౌండేషన్, బ్రౌన్ యూనివర్సిటీ వంటి విఖ్యాత సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థ పాలకమండలి మాజీ సభ్యులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి దివంగత వైవీ చంద్రచూడ్, ప్రముఖ పాత్రికేయుడు దివంగత బీజీ వర్గీస్ ఉన్నారు.