CBI : మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌పై సీబీఐ కేసు.. ఆ ఏడుగురికి లై డిటెక్టర్ పరీక్ష

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-08-24 13:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా‌లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారిన కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే హత్యాచారం కేసుతో ముడిపడిన అభియోగాలను ఆయనపై మోపలేదు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ హోదాను సందీప్ ఘోష్‌ దుర్వినియోగం చేసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని అలీపూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు అందజేశామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

అక్తర్ అలీ పిటిషన్‌తో..

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌ హోదాలో సందీప్ ఘోష్‌ భారీగా అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈడీతో విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ వినతికి కోర్టు అంగీకరించింది. అయితే అప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అవినీతి అభియోగాలతో సందీప్ ఘోష్‌‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు మొదలుపెట్టింది. దీంతో ఈకేసును సీబీఐకి బదిలీ చేయాలని సిట్‌కు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుపై విచారణ జరిపి మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐకు నిర్దేశించింది. ఈనేపథ్యంలో శనివారం ఉదయం సిట్ అధికారులు కోల్‌కతాలోని నిజాం ప్యాలెస్‌లో ఉన్న సీబీఐ కార్యాలయానికి వెళ్లి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తునకు సంబంధించిన పత్రాలను అందజేశారు.

ఆ ఏడుగురికి లై డిటెక్టర్ పరీక్ష..

మరోవైపు ఈ కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌‌ సహా మొత్తం ఏడుగురిపై శనివారం సీబీఐ లై డిటెక్టర్ (పాలీగ్రాఫ్) పరీక్ష నిర్వహించింది. లై డిటెక్టర్ టెస్టును తాజాగా ఎదుర్కొన్న మిగతా ఆరుగురిలో నలుగురు ఆగస్టు 8న రాత్రి బాధిత జూనియర్ వైద్యురాలితో కలిసి డ్యూటీ చేసిన డాక్టర్లే ఉన్నారు. ఈ నలుగురూ బాధిత జూనియర్ వైద్యురాలితో కలిసి చివరిసారిగా భోజనం చేశారు. ఇక ఈ టెస్టును చేయించుకున్న ఇంకో ఇద్దరిలో కీలక నిందితుడు, సివిక్ వాలంటరీ సెక్యూరిటీ గార్డ్ సంజయ్ రాయ్, అతడి సహోద్యోగి సౌరవ్ భట్టాచార్య ఉన్నారు. ఈ కేసులో మొట్టమొదట అరెస్టయింది సంజయ్ రాయ్. ఆగస్టు 9న తెల్లవారుజామున మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. అది జరగడానికి కొన్ని గంటల ముందు కాలేజీలో ఏమేం జరిగింది ? అనేది తెలుసుకోవడంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన కొద్దిసేపటికే సెక్యూరిటీ గార్డ్ సంజయ్ రాయ్ బయటికొస్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయింది. అందుకే అతడిని ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది. ఇంతకుముందే సంజయ్ రాయ్‌కు సైకో అనాలసిస్ టెస్టు కూడా నిర్వహించింది. ఈ కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌‌ వరుసగా తొమ్మిదో రోజు (శనివారం) కోల్‌కతాలో సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


Similar News