UCO బ్యాంక్‌లో రూ.820 కోట్ల IMPS స్కామ్.. 67 చోట్ల సీబీఐ సోదాలు
యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల అనుమానస్పద IMPS లావాదేవీల కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) రాజస్థాన్, మహారాష్ట్రలోని 67 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు గురువారం తెలిపారు.
దిశ, నేషనల్ బ్యూరో: యూకో బ్యాంక్‌లో రూ.820 కోట్ల అనుమానస్పద IMPS లావాదేవీల కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) రాజస్థాన్, మహారాష్ట్రలోని 67 చోట్ల సోదాలు నిర్వహించినట్లు అధికారులు గురువారం తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్‌సీకి చెందిన 130 పత్రాలను సీజ్ చేశారు. అలాగే, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు అధికారులు పేర్కొన్నారు.
2023 నవంబర్ 10 నుంచి 13 మధ్య ఏడు ప్రైవేటు బ్యాంకులకు చెందిన 14,600 మంది ఖాతాదారులు యూకో బ్యాంక్‌కు చెందిన 41,000 మంది ఖాతాదారుల అకౌంట్లలో IMPS లావాదేవీలను తప్పుగా పోస్ట్ చేశారు. ఈ మొత్తం విలువ రూ. 820 కోట్లు. అయితే ట్రాన్స్‌ఫర్ చేసిన అకౌంట్లలో డబ్బులు డెబిట్ కాకుండానే అవతలి వారి ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయినట్టుగా చూపించింది. డబ్బులు అకౌంట్లలో పడిన విషయం తెలుసుకున్న చాలా మంది ఖాతాదారులు వెంటనే వాటిని విత్‌డ్రా చేసుకున్నారు. ఈ అనుమానస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్ నుంచి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గతంలో నవంబర్ 2023లో సీబీఐ కేసు నమోదు చేయగా, తాజాగా సోదాలు నిర్వహిస్తోంది.