కేజ్రీవాల్ ఇల్లు పునరుద్ధరణపై సీబీఐ విచారణ..

Update: 2023-09-27 14:19 GMT

న్యూఢిల్లీ : అధికారిక నివాసం పునర్నిర్మాణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు కేంద్ర సర్కారు ఆదేశించింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక విచారణను ప్రారంభించామని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వంలోని పలువురు అధికారులను ప్రశ్నిస్తామని తెలిపారు. సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, కాంట్రాక్టర్లు సమర్పించిన బిడ్లు, కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లుల రికార్డులు, భవనం నిర్మాణ ప్లాన్‌కు​ఆమోదంతో ముడిపడిన డాక్యుమెంట్స్‌ను సమర్పించాలని ఢిల్లీ ప్రజాపనుల శాఖను ఆదేశించామని సీబీఐ అధికారవర్గాలు చెప్పాయి.

ఢిల్లీ సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణ పనులకు ఇప్పటివరకు రూ.44 కోట్లు ఖర్చు చేశారు. ఈ పనుల్లో అవకతవకలు జరిగాయని.. దీనిపై కాంప్ట్రోలర్ అండ్​ఆడిటర్ జనరల్​(కాగ్)​తో ఆడిట్ చేయించాలంటూ మే 24న కేంద్ర హోం శాఖకు లెఫ్టినెంట్​గవర్నర్ వీకే సక్సేనా లేఖ రాశారు. దీనికి స్పందనగానే ఇప్పుడు సీబీఐ విచారణ మొదలైంది. స్పెషల్ ఆడిట్​నిర్వహించాలని కాగ్‌కు కేంద్ర హోంశాఖ సూచించింది.


Similar News