ఫోన్‌తో ఈవీఎం తెరిచిన ఎంపీ బావమరిది?
కౌంటింగ్ జరిగిన రోజు సాయంత్రం వరకూ ఎన్నికల అధికారి ఫోన్ మంగేష్ పాండిల్కర్ వద్దే ఉన్నట్టు సమాచారం.
దిశ, నేషనల్ బ్యూరో: ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్ బావమరిది మంగేష్ పాండిల్కర్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల రోజు జూన్ 4న కౌంటింగ్ సెంటర్‌లో మొబైల్ ఫోన్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై పోలీసులు మంగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని గోరేగావ్ ప్రాంతంలో ఉన్న కౌంటింగ్ సెంటర్‌లో పాండిల్కర్ మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి ఈవీఎంను అన్‌లాక్ చేశారని, ఓటీపీ కోసం మంగేష్ ఫోన్ ఉపయోగించినట్టు పోలీస్ అధికారులు వెల్లడించారు. కౌంటింగ్ జరిగిన రోజు సాయంత్రం వరకూ ఎన్నికల అధికారి ఫోన్ మంగేష్ పాండిల్కర్ వద్దే ఉన్నట్టు సమాచారం. కౌంటింగ్ సెంటర్‌లో మొబైల్‌ఫోన్ వాడేందుకు అనుమతిచ్చిన ఎన్నికల కమిషన్ ఉద్యోగిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన నుంచి రవీంద్ర వైకర్ 48 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన అమోల్ గజానన్ కీర్తికర్ ఓటమి ఎదుర్కొన్నారు. ఫలితాలకు సంబంధించి సందేహాలు ఉన్నాయని ఉద్ధవ్ ఠాక్రె వర్గం ఆరోపించిన నేపథ్యంలో తాజా వ్యవహారం బహిర్గతం అయింది. ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థులు అవకతవకలపై ఎన్నికల కమిషన్‌తో పాటు పోలీసులను ఆశ్రయించారు. ఈవీఎంను అన్‌లాక్ చేయడానికి అవసరమైన ఓటీపీని జనరేట్ చేసే ఫోన్ ఎన్నికల అధికారి దినేష్ గురవ్ వద్ద ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ ఫోన్ నుంచి కాల్స్ కూడా చేసినట్టు అధికారి అంగీకరించినట్టు పోలీసులు పేర్కొన్నారు. సంబంధిత ఫోన్‌ను సీజ్ చేశారు. ఎన్నికల నియమాల ప్రకారం, ఫోన్‌ను ఎన్నికల అధికారి ఉపయోగించాల్సి ఉంటుందని, మరెవరూ ఉపయోగించకూడదు.
ఈ వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు కోసం ముంబై పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఓటీపీ జనరేట్ చేసేందుకు వాడిన మొబైల్‌ఫోణ్ రికార్డులను పరిశీలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన ఫోన్‌కు వచ్చిన కాల్స్, ఓటీపీల గురించి విచారించామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ఫోన్‌తో ఈవీఎంను ఆపరేట్ చేయలేం.. సంజయ్ నిరుపమ్
ఈవీఎంను అన్‌లాక్ చేసేందుకు ఓటీపీని ఉపయోగించారనే ఆరోపణలను శివసేన(ఏక్‌నాథ్ షిండే వర్గం) నేత సంజయ్ నిరుపమ్ ఖండించారు. మహా వికాస్ అఘాడి(ఏంవీఏ) షిండే పార్టీకి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. మొబైల్ నుంచి ఈవీఎంలను అన్‌లాక్ చేయవచ్చని వినడం ఇదే మొదటిసారి. అది జరగని పని, ఫోన్‌తో ఈవీఎంను ఆపరేట్ చేయలేం. రాహుల్ గాంధీ, సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లాంటివారే ఇలా ఆరోపిస్తున్నారు. అలా జరిగే వీలుంటే వారి అభ్యర్థులు వన్రాయ్ పోలింగ్ స్టేషన్‌లో ఎక్కువ ఓట్లు సాధించేవారు కాదని సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు కోరినట్టు రెండుసార్లు రీకౌంటింగ్ జరిగింది. ప్రక్రియ మొత్తం సీసీటీవీల్లో రికార్డ్ అయిందన్నారు.