ఈపీఎస్, అన్నామలైపై ఎంకె స్టాలిన్ పరువు నష్టం కేసు
ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
దిశ, నేషనల్ బ్యూరో: డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్‌కు అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలపై అన్నాడీఎంకేకు చెందిన పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడం, విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం గురువారం వారిపై పరువు నష్టం దావా వేసింది. రాజకీయ శతృత్వం, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. చెన్నై నగర ప్రాసిక్యూటర్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఈ దావా వేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు, పంపిణీ, వినియోగాన్ని అరికట్టడానికి ఎంకే స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలను దావాలో పేర్కొన్నారు. అలాగే, ఎంకె స్టాలిన్ సైతం, వాస్తవాల అధారంగా నిర్మాణాత్మక విమర్శలకు సిద్ధంగా ఉన్నామని, డ్రగ్స్ రాకెట్ వంటి ఆరోపణలు స్వాభావికంగా పరువు నష్టం కలిగించేవి. పూర్తిగా ముఖ్యమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని, దీనివల్ల ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. కాగా, ఇటీవల ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ చేపట్టిన ఆపరేషన్‌లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ వ్యవహారంలో తమిళ సినీ నిర్మాత, డీఎంకే బహిష్కృత నేత జాఫర్ సాదిక్ కీలకంగా ఉన్నట్టు తెలుస్తోంది.