Tmc mla: ఎమ్మెల్యేలపై పార్టీ కార్యకర్తల దాడి.. పశ్చిమ బెంగాల్‌లో ఘటన
ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (Tmc)కి చెందిన మినాఖాన్ ఎమ్మెల్యే ఉషారాణి మోండల్(Usharani mondal), సందేశ్ ఖాలీ ఎమ్మెల్యే సుకుమార్ మెహతా(Sukumar mehatha)లపై దాడి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే ఉషారాణి మోండల్ ఆమె భర్త మృత్యుంజయ్‌తో కలిసి కాళీ పూజ(kali puja)కు వెళ్లి తిరిగి వస్తుండగా హరోవా ప్రాంతంలో స్థానిక టీఎంసీ నాయకుడు ఖలేక్ మొల్లా నేతృత్వంలోని సుమారు 30 మంది కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డగించి దాడికి పాల్పడ్డారు. అనంతరం హరోవా పోలీస్ స్టేషన్‌లో ఉషారాణి ఫిర్యాదు చేశారు. అయితే తమపై అటాక్ చేసింది పార్టీ కార్యకర్తలేననే ఆరోపణలను ఆమె కొట్టి పారేశారు.
మరొక ఘటనలో సందేశ్ ఖాలీ ఎమ్మెల్యే సుకుమార్ మెహతాపై దాడి జరిగింది. కాళీ పూజకు వెళ్లి నజత్ నుంచి తిరిగి వస్తుండగా సిముల్తాలా గ్రామంలో పలువురు వ్యక్తులు దాడికి పాల్పడినట్టు సుకుమార్ ఆరోపించారు. టీఎంసీ నుంచి బహిష్కరంచిన షేక్ షాజహాన్‌తో అనుబంధం ఉన్న పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని, మరో టీఎంసీ నాయకుడు అబ్దుల్ కాదర్ మొల్లా మద్దతుదారులు దాడిలో పాల్గొన్నారని తెలిపారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, అధికార ఎమ్మెల్యేలపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి పాల్పడటం హాట్ టాపిక్‌గా మారింది.