మన బంధాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.. మోడీ రష్యా పర్యటనపై అమెరికా అక్కసు

ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అమెరికా మరోసారి అక్కసు వెల్లగక్కింది. భారత్ లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-12 07:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అమెరికా మరోసారి అక్కసు వెల్లగక్కింది. భారత్ లోని అమెరికా దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా- భారత్ బంధం బలమైనదని.. అయితే దాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన రక్షణ సదస్సులో గార్సెట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వ్యూహాత్మక విషయాల్లో స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకునేందుకు భారత్ భావిస్తుందని.. అయితే, ఆ విషయాన్ని పూర్తిగా స్వాగతిస్తామన్నారు. కానీ, ఘర్షణల సమయంలో వ్యూహాత్మక స్వేచ్ఛ ఉండదని.. సంక్షోభం సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పరస్పరం అండగా ఉండాలని పేర్కొన్నారు.. భారత్‌-అమెరికా మధ్య సంబంధాలు విస్తృతమైనవి, లోతైనవే.. కానీ ఆ బంధాన్ని తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు.

శాంతి కోసం నిలబడాలి

ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ..‘‘యుద్ధం ఎవరికీ దూరం కాదు. శాంతి కోసం మనం నిలబడ్డామంటే అది కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం కాకూడదు. శాంతియుత నియమాలను పాటించని వారి యుద్ధతంత్రాలను అడ్డుకునేలా కచ్చితమైన చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ముప్పును ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యం కాదు. మన బంధాన్ని గౌరవిస్తూ ప్రపంచశాంతి కోసం సమష్టి చర్యలు చేపట్టాలి’’ అని అన్నారు. మాస్కో పర్యటనలో మోడీ ఉన్నప్పుడు అమెరికా స్పందించింది. రష్యాత సంబంధాలపై ఆందోళనలు ఉన్నప్పటికీ.. భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా స్పష్టం చేసింది.



Similar News