'రేప్ బాధితురాలి గర్భాన్ని బలవంతంగా ఉంచరాదు'

లైంగికంగా వేధించిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వాలని అత్యాచార బాధితురాలిని బలవంతం చేయకూడదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.

Update: 2023-07-11 13:27 GMT

అలహాబాద్: లైంగికంగా వేధించిన వ్యక్తి బిడ్డకు జన్మనివ్వాలని అత్యాచార బాధితురాలిని బలవంతం చేయకూడదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక 25 వారాల గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు ఇటీవల విచారించింది. లైంగిక వేధింపులకు గురైన మహిళలపై మాత‌ృత్వపు బాధ్యతను బలవంతంగా రుద్దడం వారు గౌరవంగా జీవించాలనుకునే హక్కును ఉల్లంఘించడమేనని, వారు చెప్పుకోలేని బాధలకు కారణమవుతుందని జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ ప్రశాంత్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాధితురాలు చెవిటి, మూగ బాలిక. గర్భం దాల్చి 24 వారాలు గడిచిపోయినందున అబార్షన్ కోసం ఆమె చేసిన అభ్యర్థనను అనుమతించాలా.. వద్దా.. అనేది కోర్టు ముందున్న ప్రధాన సమస్య. ఈ మైనర్ బాలికపై ఆమె పొరుగున ఉన్న వాళ్లు అనేక సార్లు అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే.. ఆమె మాట్లాడలేకపోవడంతో తనపై జరిగిన దురాగతాన్ని చాలా కాలం పాటు ఎవరికీ చెప్పుకోలేకపోయిందని బాధితురాలి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

అసాధారణ కేసుల్లో అబార్షన్‌కు అనుమతి..

బాలిక శరీరంలో మార్పులను గుర్తించిన తల్లి ఆరా తీయగా.. తనపై అత్యాచారం జరిగినట్లు సంకేత భాష ద్వారా వెల్లడించింది. తల్లి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాధితురాలికి గత నెలలో వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె గర్భం దాల్చి అప్పటికే 23 వారాలైందని తేలింది. గర్భాన్ని తొలగించుకునే అనుమతి ఇవ్వాలన్న అభ్యర్థన జూన్ 27వ తేదీన మెడికల్ బోర్డు ముందుకు వచ్చింది. గర్భం దాల్చి 24 వారాలు దాటినందున అబార్షన్ చేయాలంటే కోర్టు అనుమతి కావాలని బోర్డు అభిప్రాయపడింది.

సాధారణంగా 24 వారాలు మించిన గర్భాన్ని తొలగించడానికి కోర్టులు అనుమతించవు. అయితే.. అసాధారణమైన కేసుల్లో 24 వారాలకు మించిన గర్భాన్ని కూడా న్యాయస్థానాలు అనుమతించాయని బెంచ్ గుర్తు చేసింది. మానవతా దృక్పథం, అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బాలికను ఒక్క రోజులో పరీక్షించాలని ప్రభుత్వాస్పత్రి వైద్యులను కోర్టు ఆదేశించింది. నివేదికను బుధవారం సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కూడా ఆస్పత్రిని ఆదేశించింది.


Similar News