ప్రధాని మోడీ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’.. రాహుల్‌గాంధీ సంచలన ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో : ఈవీఎంలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-31 16:08 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఈవీఎంలను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్‌ ఫిక్సింగ్‌, సోషల్‌ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా బీజేపీ 180కి మించి లోక్‌సభ స్థానాలను గెలవడం అసాధ్యమన్నారు. ఎటువంటి ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ లేకుండా 400 లోక్‌సభ స్థానాల భారీ లక్ష్యాన్ని బీజేపీ అందుకోవడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’ లోక్‌తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘400 లోక్‌సభ సీట్ల మైలురాయిని దాటేందుకు ప్రధాని మోడీ ఇప్పటికే అంపైర్లను కూడా ఎన్నుకున్నారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడు అంపైర్లపై ఒత్తిడి చేసి.. ఆటగాళ్లను కొనేసి.. కెప్టెన్లను బెదిరించి మ్యాచ్‌లు గెల్చుకోవచ్చు. దీన్ని క్రికెట్‌లో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటారు. మన ఎదుట లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోడీ ఎన్నుకున్నారు. మ్యాచ్‌కు ముందే ‘ఇండియా’ టీమ్‌లోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు’’ అని కాంగ్రెస్ అగ్రనేత వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, ఆ తర్వాత దేశం మంటల్లో కూరుకుపోతుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘‘కాంగ్రెస్‌ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ. ఎన్నికల సన్నాహాల నడుమ మా పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. మేం ప్రచారం చేయాలి. కార్యకర్తలను రాష్ట్రాలకు పంపాలి. పోస్టర్లు అంటించాలి. కానీ మా బ్యాంకు ఖాతాలు నిలిచి పోయాయి. ఇవేం ఎన్నికలు’’ అని ఆయన మండిపడ్డారు. ఇక లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో ప్రతిపక్షాలను మోడీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు.


సోరెన్, కేజ్రీవాల్‌లను విడుదల చేయాలి : ప్రియాంక

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇండియా కూటమి తరఫున కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఎదుట కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ 5 కీలక డిమాండ్లు పెట్టారు. కాంగ్రెస్ నిధులను స్తంభింపచేయడం, ఐటీ శాఖ నోటీసుల గురించి ప్రస్తావిస్తూ.. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీల ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న చర్యలను ఆపాలని ఈసీని కోరారు. ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ చర్యలను నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ద్వారా వివిధ కంపెనీల నుంచి బీజేపీ దోపిడీ చేసిన నిధుల వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ చేయించాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాలన్నారు. ఈడీ అరెస్టు చేసిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లను తక్షణమే విడుదల చేయాలని ఈసీని ప్రియాంక కోరారు.

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ విషం లాంటివి : ఖర్గే

బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ విషం లాంటివని.. వాటి విషాన్ని రుచి చూసినా చచ్చిపోతారని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ప్రాణం మీదకు తెచ్చుకున్నట్టేనన్నారు. ‘‘మీరంతా నియంతృత్వం కోరుకుంటున్నారా..? ప్రజాస్వామ్యం కోరుకుంటున్నారా..?’’ అని సభకు విచ్చేసిన ప్రజలను ఖర్గే ప్రశ్నించారు. ‘ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారు చేతలెత్తండి’ అని ఖర్గే అనగానే అంతా చేతులెత్తారు. ఆ వెంటనే ఆయన ‘నియంతృత్వాన్ని కోరుకునే వారు తక్షణమే దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉంది’ అని కామెంట్ చేశారు.

కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు.. ఒక సిద్ధాంతం : సీఎం మాన్

అరవింద్ కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘‘ఢిల్లీలో స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించిన వాళ్లను బీజేపీ జైలులో వేసింది. హేమంత్‌ సోరెన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ను కారాగారంలో బంధించింది. కాంగ్రెస్‌ నిధులను స్తంభింపజేసింది. ఇంటికి మీరు యజమానులా..? కాదు.. 140 కోట్ల మంది ప్రజలది ఈ ఇల్లు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత రాజకీయాల్లో సరికొత్త శక్తి పుట్టింది : సీతారాం ఏచూరి

‘‘భారత రాజకీయాల్లో సరికొత్త శక్తి నేడు పుట్టింది. దేశ రాజ్యాంగం, గణతంత్ర భావాన్ని రక్షించడమే నిజమైన స్వాతంత్య్రం. మేం దాన్ని సాధిస్తాం. అవినీతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి విముక్తి కల్పిస్తాం’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.

బీజేపీ అంటే ‘భ్రష్ట్ జనతా పార్టీ’ : ఉద్ధవ్

బీజేపీ అత్యంత అవినీతిమయ పార్టీ అని తేలిందన్నారు శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. ఆ పార్టీ నిజస్వరూపం ప్రజల ముందు బట్టబయలైందన్నారు. బీజేపీ అంటే భ్రష్ట జనతా పార్టీ అని మండిపడ్డారు. గతంలో బీజేపీపై అవినీతి ఆరోపణలు చేసిన పలువురు నేతలు ఇటీవలే ఆ పార్టీలోనే చేరిపోయారని తెలిపారు. ప్రఫుల్ పటేల్ పై ఎవరు ఆరోపణలు చేశారు? ఆదర్శ్ పై ఎవరు ఆరోపణలు చేశారు? జనార్ధన్ రెడ్డి, నవీన్ జిందాల్ పై ఆరోపణలు చేసింది ఏ పార్టీ అని ప్రశ్నించారు.

అధికారం కోల్పోతామనే భయంలో బీజేపీ : అఖిలేష్

‘‘బీజేపీకి అధికారం కోల్పోతామనే భయం పట్టుకుంది. అందుకే దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలపై దాడులు చేయిస్తోంది’’ అని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినందుకు బీజేపీ ప్రపంచ వ్యాప్తంగా అవమానాన్ని ఎదుర్కొంటోందన్నారు. బీజేపీ చెప్పినన్ని అబద్దాలు ప్రపంచంలో మరెవరూ చెప్పి ఉండకపోవచ్చన్నారు. ఎవరు అధికారంలోకి వస్తారో.. ఎవరు అధికారం కోల్పోతారో త్వరలోనే తెలుస్తుందని ఆయన చెప్పారు.

Tags:    

Similar News