BREAKING: నీట్ పరీక్ష, ఫలితాలపై విచారణ షురూ.. సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు

NEET-(UG 2024) పేపర్‌ లీకేజీ విషయంలో దాఖలైన విషయంపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

Update: 2024-07-08 10:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: NEET-(UG 2024) పేపర్‌ లీకేజీ విషయంలో దాఖలైన విషయంపై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని తేల్చి చెప్పింది. అయితే, ఆ లీక్ అయిన పేపర్ ఎంత మందికి చేరిందో అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉందని పేర్కొంది. పేపర్ లీక్‌తో కేవలం ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని చెప్పడం నమ్మశక్యంగా లేదంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోనే ప్రతిష్టాత్మక పరీక్షను సక్రమంగా నిర్వహించపోవడం, పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడి ఉన్న అంశమని కోర్టు అభిప్రాయపడింది. జాగ్రత్తగా పరిశీలించాకే ఈ కేసులో తుది తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీబీఐ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఎంతమంది విద్యార్థులు ఫలితాలను విత్ హెల్డ్‌లో పెట్టారో వివరాలు తెలియజేయాలని కోరింది. నీట్, జేఈఈలో సీటు ప్రతి ఒక్కరి కల అని, పరీక్ష రద్దు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించడమనేది చివరి అప్షన్ సీజేఐ చంద్రచూడ్ అన్నారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు ప్రకటించింది.

కాగా, నేషనల్‌ ఎలిజిబులటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్) ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ఆ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కోరుతూ.. మొత్తం దేశ వ్యాప్తంగా సుప్రీం కోర్టులో 38 పిటిషన్లు దాఖలయ్యాయి. పేపర్‌ లీకేజీ‌తో పరీక్షల పవిత్రతే దెబ్బతింటుందని, పరీక్షల ఉనికిని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కొందరు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్లపై ఇవాళ సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.  


Similar News