Rajnath Singh: రాజ్ నాథ్ సింగ్ తో తులసీ గబ్బార్డ్ భేటీ.. దేనిపై చర్చ జరిగిందంటే?
అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్ అధికారి తులసీ గబ్బార్డ్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె న్యూఢిల్లీ వచ్చారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటలిజెన్స్ అధికారి తులసీ గబ్బార్డ్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె న్యూఢిల్లీ వచ్చారు. అందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లో సమావేశం జరిగింది. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రతాపరమైన సంబంధాల బలోపేతం, ఇంటెలిజెన్స్ షేరింగ్ వంటి అంశాల గురించి సుదీర్ఘ చర్చలు జరిపారు. అంతేకాకుండా, రక్షణ ఒప్పందంపైనా చర్చలు జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా, తులసీ గబ్బార్డ్ గ్లోబల్ ఇంటెలిజెన్స్ కాంక్లేవ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య నిఘా సమాచార పంపిణీ, సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని పెంపొందించుకోవడం, భారత్-అమెరికాల ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుగుణంగా భద్రత రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వారిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇండో-పసిఫిక్, ఖలిస్థానీ ఉగ్రవాదం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
మోడీ, ట్రంప్ గుడ్ ఫ్రెండ్స్
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి స్నేహితులని తులసీ గబ్బార్డ్ పేర్కొన్నారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఓడించాలనే దృఢ నిబద్ధత కూడా ఉంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘వారు సమష్టి లక్ష్యాలపై దృష్టిపెట్టారు. భారత్-అమెరికా సంబంధాలు ఎంతో పురాతనమైనవి. వాటిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇరుదేశాలు పరస్పర ప్రయోజనాలను గుర్తిస్తున్నాయి. శాంతి, సుసంపన్నత, స్వేచ్ఛ, భద్రత వంటి అంశాలు కేంద్రంగా ఇవి ఉన్నాయి. మన రెండు గొప్ప దేశాలకు ఉత్తమ నాయకులు ఉన్నారు. వారు మంచి మిత్రులు. సమష్టి లక్ష్యాలు, పరస్పర ప్రయోజనాలపై దృష్టిపెట్టారు. ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టమైన వైఖరితో చూస్తున్నారు. ఆయన దృష్టి మొత్తం శాంతిస్థాపనపైనే ఉంది. యుద్ధాన్ని ముగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చర్చలు ఇప్పుడే మొదలయ్యాయి’’ అని అన్నారు.
హౌతీ బెదిరింపులపై
ఎర్ర సముద్రం ప్రాంతంలో హౌతీ ముప్పు గురించి తులసీ మాట్లాడారు. ఇరాన్ మద్దతు ఉన్న సైనిక బృందం చాలా కాలంగా కీలకమైన షిప్పింగ్ మార్గంపై దాడి చేస్తోందని అన్నారు. ఈ దారుణాలను ఆపేందుకు బైడెన్ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. బైడెన్ హౌతీలను ఉగ్రవాదుల జాబితా నుండి తొలగించారని గుర్తుచేశారు. కానీ, ట్రంప్ వారిని 'విదేశీ ఉగ్రవాద సంస్థ'గా తిరిగి గుర్తించారని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌లోని పరిస్థితి గురించి అమెరికా తీవ్ర ఆందోళన చెందుతోందని గబ్బార్డ్ అన్నారు. హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు సహా మతపరమైన మైనారిటీలపై చాలా కాలంగా హింస జరుగుతోందన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పుకొచ్చారు.