వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

Update: 2024-10-05 07:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో ఇటీవల రైల్వే స్టేషన్లకు, విమానాశ్రయాలకు వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు ఘటనలు ప్రయాణికులను కలవర పెడుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని వడోదర, రాజ్ కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ ఈ-మెయిల్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. బాంబుస్క్వాడ్స్, ఎయిర్ పోర్ట్ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. కాగా దేశంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు వడోదర పోలీస్ కమిషనర్ నర్సింహా కమోర్ వెల్లడించారు. ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

వడోదర విమానాశ్రయానికి జూన్ 18న కూడా బాంబు పేలుడు హెచ్చరికతో కూడిన ఇమెయిల్ రావడం..భద్రతా దళాల తనిఖీల్లో అదంతా వట్టిదేనని తేలిపోవడం విదితమే. ఇటీవల రాజస్థాన్ లోని శ్రీరంగా నగర్, బికనూర్, కోట, బూందీ, ఉదయపూర్, జైపూర్ రైల్వే స్టేషన్లకు కూడా ఒకే రోజు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ తరహా ఘటనలపై భద్రతా వర్గాలు సీరియస్ గా స్పందిస్తూ తక్షణమే తనిఖీలు చేపట్టడంతో పాటు నిందితులను వేగంగా గుర్తిస్తున్నారు.


Similar News