ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్ స్వీప్..కలిసొచ్చిన అభ్యర్థుల మార్పు!

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్కును దాటింది. అయితే అనుకున్నంత సీట్లు రాకపోయినప్పటికీ పలు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.

Update: 2024-06-04 18:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ మార్కును దాటింది. అయితే అనుకున్నంత సీట్లు రాకపోయినప్పటికీ పలు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్య ప్రదేశ్ 29, ఢిల్లీ 7, ఉత్తరాఖండ్ 5, హిమాచల్ ప్రదేశ్ 4, అరుణాచల్ ప్రదేశ్ 2, త్రిపుర 2, అండమాన్ నికోబార్ 1 స్థానంలో అన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనేగాక మిగతా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే అన్ని స్థానాలు గెలుచుకోవడం గమనార్హం. అయితే ఢిల్లీలో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న పలువురిని మార్చడం, ఆప్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో బీజేపీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

నకుల్ నాథ్, దిగ్విజయ్ ఓటమి

మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందగా.. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. చింద్వారా స్థానాన్ని కూడా హస్తం పార్టీ కోల్పోయింది. అంతేగాక రాజ్‌గఢ్‌ నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్‌ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ లక్షా 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. చింద్వారాలో కాంగ్రెస్ అభ్యర్థి నకుల్ నాథ్ బీజేపీ అభ్యర్థి వివేక్ బంటి సాహుపై లక్షా 13 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బీజేపీ అభ్యర్థులు గుణ స్థానం నుంచి జ్యోతిరాదిత్య సింధియా, ఖజురహో నుంచి వీడీ శర్మ, భోపాల్ నుంచి అలోక్ శర్మ, మందసౌర్ నుంచి సుధీర్ గుప్తా 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. 


Similar News