ఎడారి నేలపై వికసించిన ‘కమలం’
ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ‘కమలం’ వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
జైపూర్: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ‘కమలం’ వికసించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.వరుసగా రెండోసారి అధికారం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో గత నెల 25న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. కరణ్‌పూర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ మృతి చెందడంతో ఆ స్థానానికి పోలింగ్ వాయిదా పడింది. దీంతో 199 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. 199 స్థానాలకుగాను మొత్తం 1,875 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 75.45శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఆదివారం వెలువడగా, బీజేపీ ఘన విజయం సాధించింది. 30 ఏళ్లుగా ఏ ప్రభుత్వానికీ రెండోసారి అధికారం ఇవ్వని రాజస్థాన్ ప్రజలు.. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ, బీజేపీ ఘన విజయం సాధించింది.
ప్రభుత్వ ఏర్పాటుకు 100 స్థానాల్లో గెలవాల్సి ఉండగా, బీజేపీ 115 స్థానాల్లో తమ జెండా ఎగురవేసింది. 2018 నాటి ఎన్నికల్లో బీజేపీ 73 స్థానాల్లో గెలుపొందగా, ఈసారి 42 సీట్లు ఎక్కువగా సాధించడం విశేషం. ఇక, సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్.. తమ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 198 స్థానాల్లో పోటీ చేయగా, తమ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)కు ఒక సీటును కేటాయించింది. తమకు కేటాయించిన ఒక్క సీటును ఆర్ఎల్డీ గెలుచుకుంది. కానీ, 198 నియోజకవర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. 69 స్థానాల్లోనే గెలుపొందింది. గత ఎన్నికల్లో 100 సీట్లలో విజయం సాధించగా, ఈసారి 30 స్థానాలను కోల్పోయింది. మరోవైపు, గత ఎన్నికల్లో 6 స్థానాల్లో గెలిచిన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ).. ఈసారి 184 స్థానాల్లో పోటీ చేయగా, రెండు స్థానాలకే పరిమితమైంది. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మరో 12 స్థానాల్లో విజయం సాధించారు.
పనిచేసిన మోడీ చరిష్మా.. బీజేపీ వ్యూహం
ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎన్నో కారణాలుండగా, అందులో ఒకటి ప్రధాని మోడీకి ఉన్న ప్రజాదరణ. పార్టీలో వర్గపోరును నియంత్రించే వ్యూహంలో భాగంగా సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లినా.. విజయం సాధించిందంటే ప్రధాని మోడీ చరిష్మా సైతం ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మిగతా రాష్ట్రాలతోపాటు రాజస్థాన్‌లోనూ ప్రధాని మోడీ అన్నీతానై సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచార రథాన్ని ముందుకు నడిపారు. 2018 అసెంబ్లీ పోల్స్‌లో ఓడిపోయినా 2019లో జరిగిన లోక్ సభ పోల్స్‌లో ఆశ్చర్యకరంగా మొత్తం 25స్థానాలకుగానూ 24 చోట్ల గెలుపొందిన విషయం తెలిసిందే.
మోడీ చరిష్మా వల్లే ఇలా జరిగిందనే టాక్ ఉంది. ఈ ఎన్నికల్లోనూ అదే పనిచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రుల్ని సైతం బరిలోకి దింపడం, పక్కా వ్యూహంతో అన్ని ప్రచార సభల్లోనూ బీజేపీ నేతలంతా ‘రెడ్ డైరీ’ అంశాన్ని ప్రస్థావిస్తూ, గెహ్లాట్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ప్రజల్లోకి వెళ్లేలా చేయడంలో సఫలమైంది. అలాగే, పేపర్ లీకేజీల ఘటనలు, కాంగ్రెస్ కుంభకోణాలపై ‘సిట్’ను ఏర్పాటు చేస్తామనే హామీ నిరుద్యోగ యువకులను ఆకర్షించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
‘కులగణన’ను పట్టించుకోని ప్రజలు
బీజేపీతో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీయే ‘ఆకర్షణీయ’మైన హామీలను ఇచ్చినప్పటికీ ప్రజలు మాత్రం కాషాయ పార్టీకే పట్టం కట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన కులగణన హామీని ప్రజలు పట్టించుకోలేదు. అలాగే, రైతులకు రూ.2లక్షల వరకు వడ్డీ లేని రుణాలతోపాటు స్వామినాథన్ కమిషన్ ప్రకారం కనీస మద్దతు ధర ప్రకటిస్తామని, కుటుంబ పెద్దకు రూ.10వేల వార్షిక గౌరవ వేతనం, రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్లు, పశువుల పెంపకందారుల నుంచి కిలో రూ.2 చొప్పున పేడ కొనుగోలు, చిరంజీవి ఆరోగ్య బీమా పథకం రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంపు, కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు/ట్యాబ్లెట్లు వంటి ఆకర్షనీయమైన హామీలనూ రాజస్థాన్ ప్రజలు తిరస్కరించడం గమనార్హం.
1990 నుంచి ఇదే ట్రెండ్..
1990 నుంచి 2018 దాకా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మినహా ఏ పార్టీ కూడా సగటున 28 కంటే ఎక్కువ సీట్లను రాజస్థాన్‌లో గెల్చుకోలేకపోయింది. గత మూడు దశాబ్దాలలో జరిగిన పోల్స్‌లో ఇతర పార్టీలన్నీ కలుపుకుంటే.. అవి పొందిన ఓట్ల సగటు 30 శాతానికి మించదు. ప్రతిసారి ఎన్నికల్లో విభిన్నమైన రిజల్ట్‌తో ఆశ్చర్యపరిచే సత్తా రాజస్థాన్ ఓటర్ల సొంతం. 2013లో మోడీ వేవ్ నడుమ బీజేపీకి ఆ రాష్ట్ర ప్రజలు 163 సీట్లతో అఖండ విజయాన్ని అందించారు. 2018కి వచ్చేసరికి కనీసం సగం సీట్లను కూడా నిలుపుకోలేక వసుంధరా రాజే సింధియా నేతృత్వంలోని బీజేపీ ఓటమిని చవిచూసింది. 2018లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కట్టబెట్టిన ఓటర్లు.. ఈసారి మాత్రం అధికారాన్ని దూరం చేశారు. మళ్లీ బీజేపీని గెలిపించారు.