బీజేపీ ఐదో లిస్టులో మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్, మాజీ హైకోర్టు జడ్జి సహా ప్రముఖులు వీరే..

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది.

Update: 2024-03-24 17:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ఐదో జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 111 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌కు హర్యానాలోని కురుక్షేత్ర టికెట్‌ దక్కింది. మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, రవిశంకర్ ప్రసాద్‌ సహా పలువురి పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి బీజేపీ టికెట్‌ దక్కింది. ‘రామాయణం’ టీవీ సీరియల్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిభిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. ఆయన స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన జితిన్‌ ప్రసాదకు టికెట్‌ కేటాయించింది. అయితే ఆశ్చర్యకరంగా వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి మాత్రం సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను ఇచ్చారు.

మాజీ హైకోర్టు జడ్జి, మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్..

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న జనరల్ వీకే సింగ్‌ స్థానంలో ఎయిర్‌ఫోర్స్ మాజీ చీఫ్ ఆర్‌కేఎస్ భదౌరియాకు అవకాశం కల్పించారు. కోల్‌కతా హైకోర్టు జడ్జి పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరిన అభిజిత్ గంగోపాధ్యాయకు బెంగాల్‌లోని తమ్లూక్ నియోజకవర్గం నుంచి పోటీకి నిలిపారు. కర్ణాటకలోని బెల్గాం నుంచి జగదీశ్ షెట్టర్, పాట్నా సాహిబ్ అభ్యర్థిగా రవిశంకర్ ప్రసాద్, బెగుసరాయ్ నుంచి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పూరీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పోటీ చేయనున్నారు. బక్సర్ స్థానం నుంచి కేంద్ర సహాయ మంత్రి అశ్విని చౌబే స్థానంలో మిథిలేష్ తివారీకి ఛాన్స్ ఇచ్చారు.

బెంగాల్, ఒడిశా, బిహార్, యూపీలలో..

మొత్తంగా 111 లోక్‌సభ స్థానాలను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్‌లోని 19, ఒడిశాలోని 18 మంది, బిహార్‌లోని 17, ఉత్తరప్రదేశ్‌‌లోని 13, రాజస్థాన్‌లోని 7, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌‌లలోని చెరో 6, హర్యానా, కర్ణాటక, కేరళలలోని చెరో 4, జార్ఖండ్‌, మహారాష్ట్రలలోని చెరో 3, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌‌లలోని చెరో 2, గోవా, సిక్కిం, మిజోరంలలోని చెరో స్థానాలకు బీజేపీ అభ్యర్థులను అనౌన్స్ చేసింది. ఈ లిస్టులో తెలంగాణ నుంచి ఆరూరి రమేశ్‌ (వరంగల్‌), తాండ్ర వినోద్‌ రావు (ఖమ్మం)లకు టికెట్స్ కేటాయించారు. ఏపీలోని ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సీఎం రమేష్ (అనకాపల్లి), కొత్తపల్లి గీత (అరకు), పురంధేశ్వరి (రాజమండ్రి), శ్రీనివాస వర్మ(నరసాపురం), కిరణ్ కుమార్ రెడ్డి(రాజంపేట), మాజీ ఐఏఎస్, గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్(తిరుపతి)లకు బీజేపీ టికెట్స్ దక్కాయి.

Tags:    

Similar News