ఢిల్లీలో బీజేపీ నిరసన.. వాటర్ ఫిరంగులను ప్రయోగించిన పోలీసులు

దేశ రాజధానిలో ప్రజల నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి

Update: 2024-06-22 09:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధానిలో ప్రజల నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఓఖ్లాలోని జల్ బోర్డు ఫిల్లింగ్ పంపు వద్ద బీజేపీ నేత రమేష్ బిధూరి ఆధ్వర్యంలో పలువురు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను మోసం చేసింది. ఢిల్లీ ప్రజల భావోద్వేగాలతో ఆడుకుంది. ఢిల్లీలో నీటి కొరతకు కారణం ఆ పార్టీయేనని బీజేపీ నేత రమేష్ అన్నారు.

బీజేపీ నేత షెహజాద్ పూనావాలా ఆప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హర్యానా సరిపడా నీటిని పంపుతోందని, సుప్రీంకోర్టు కూడా దీనిని అంగీకరించిందని ప్రజలకు నీటి కష్టాలు రావడానికి ఆప్‌దే బాధ్యత, గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో వారే అధికారంలో ఉన్నారు. ముఖ్యమైన శాఖలు ఆప్‌ వద్దే ఉన్నాయి. సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని షెహజాద్ అన్నారు.

ఇదిలా ఉంటే ఈ నిరసనలో పోలీసులు వాటర్ ఫిరంగులు ప్రయోగించడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలే ఢిల్లీలో నీళ్ల కష్టాలు ఉంటే, నిరసనకారులకు చెదరగొట్టడానికి నీళ్లను వృధా చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దక్షిణ ఢిల్లీలోని భోగల్ వద్ద ఢిల్లీ నీటి సంక్షోభంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఢిల్లీ నీటి మంత్రి అతిషి శనివారం మరోసారి బీజేపీని తప్పుబట్టారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి అందజేసే నీటిని నిలిపివేసిందని ఆమె ఆరోపించారు.


Similar News