లీడింగ్ లో బీజేపీ, కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటుపై భూపిందర్ హుడా ధీమా
హర్యానాలో బీజేపీ, జమ్ము కశ్మీర్ లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉన్నాయి. హర్యానాలో కాంగ్రెస్ వెనుకబడి ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని భూపిందర్ హుడా ధీమా వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి అధికార బీజేపీ - కాంగ్రెస్ ల మధ్య గట్టిపోటీనే కనిపించింది. మధ్యలో బీజేపీ అనూహ్యంగా లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 49, కాంగ్రెస్ 34 స్థానాల్లో లీడింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ లీడ్ లో లేకపోయినా హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గర్హి సంప్లా కిలోలి అభ్యర్థి భూపిందర్ హుడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇది హర్యానా ప్రజల విజయమని, హర్యానాలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది అధిష్ఠానమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
జమ్ములో కాంగ్రెస్ కూటమి
జమ్ము కశ్మీర్ లో బీజేపీకి షాక్ తప్పేలా లేదు. ఆర్టికల్ 370 రద్దుతో తమకే ఓట్లు ఎక్కువగా పడతాయని భావించగా.. ఊహించని ఎదురుదెబ్బే తగిలేలా ఉంది. ట్రెండ్స్ లో కాంగ్రెస్ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు 49 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా.. బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 16 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి. హర్యానాలో బీజేపీ, జమ్ములో కాంగ్రెస్ కూటమి లీడింగ్ లో ఉండగా.. రెండు చోట్లా తమదే గెలుపు అవుతుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.