ఐఎన్ ఎల్ డీ, ఆప్ తోనే హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్?

Update: 2024-10-08 10:04 GMT

దిశ, వెబ్ డెస్క్ : హర్యానాలో అధికారం కోసం కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలు గల్లంతు కావడానికి..బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడానికి ఓట్ల చీలికనే ప్రధాన కారణంగా మారింది. హర్యానాలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు 24 శాతం జాట్ సామాజి కవర్గం జనాభాపై ఆశలు పెట్టుకుంది. జాట్ లతో పాటు దళిత్, మైనార్టీ ఓటర్లు కూడా ఆదరిస్తారని నమ్ముకుంది. అయితే జాట్ ల ఓట్లను ఐఎన్ ఎల్ డీ గణనీయంగా చీల్చిందంటున్నారు ఎన్నికల విశ్లేషకులు. అలాగే ఆప్ కూడా సొంతంగా పోటీ చేయడం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను చీల్చడానికి కారణమైందంటున్నారు. ఐఎన్ ఎల్ డీ, ఆప్ పార్టీలు పోషించిన ఓట్ల చీలిక ప్రభావంతోనే ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయన్న విశ్లేషణ సాగుతోంది. 2019 ఎన్నికల్లో పది స్థానాల్లో విజయం సాధించి, కింగ్ మేకర్‌గా అవతరించిన జననాయక్ జనతా పార్టీ.. ప్రస్తుతం మాత్రం చతికిలబడింది. కనీసం ఒక్క స్థానంలోనూ ఆ పార్టీ ఆధిక్యతలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా ఉచ్నానాకలాన్‌ స్థానంలో వెనుకంజలో ఉన్నారు.

హర్యానాలో 90 స్థానాల్లో బీజేపీకి 48, కాంగ్రెస్ కు 36, ఐఎన్ ఎల్ డీ 2, ఇతరులు 4 స్థానాల్లో అధిక్యతలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మలచుకుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. తాజా విజయంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జాట్‌ల వ్యతిరేకతను అధిగమించి బీజేపీ గెలుపు బావుటా ఎగురువేసింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా మాజీ సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు.


Similar News