బీజేపీకి భయపడే ప్రసక్తే లేదు: ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు
బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సస్పెన్షన్‌కు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శివమొగ్గలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ముందే ఊహించానని చెప్పారు. శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీలో ఉండనున్నట్టు వెల్లడించారు. అయితే పార్టీ బహిష్కరించినట్టు తనకు ఇంకా సమాచారం అందలేదని తెలిపారు. శివమొగ్గలో ఎంపీగా విజయం సాధించడం ఖాయమని చెప్పారు.
కాగా, హవేరీ లోక్ సభ స్థానం నుంచి తన కుమారుడు కాంతేశ్‌కు బీజేపీ టికెట్ కేటాయించకపోవడంతో ఈశ్వరప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో గతంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా దానిని పక్కన బెట్టి మరోసారి శివమొగ్గ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచారు. అంతేగాక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై విమర్శలు గుప్పించారు. తన కుమారుడి రాజకీయ అవకాశాలను దెబ్బతీసేందుకు యడ్యూరప్ప ప్రయత్నించారని ఆరోపించారు. టికెట్ రాకపోవడానికి ఆయనే కారణమని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం శివమొగ్గ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బీజేపీ తరఫున బరిలో నిలిచారు.