Ambedkar’s great-grandson: కాషాయపార్టీపై అంబేద్కర్ మునిమనుమడు రాజారత్నం సంచలన ఆరోపణలు

కాషాయపార్టీపై అంబేద్కర్ మునిమనుమడు రాజారత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన సందర్భంగా రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-20 09:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాషాయపార్టీపై అంబేద్కర్ మునిమనుమడు రాజారత్నం సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటన సందర్భంగా రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని బీజేపీ నేతలు తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను విడుదల చేశారు. ‘రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు, ధర్నాలు చేసేందుకు దేశంలోని అతిపెద్ద పార్టీ నన్ను సంప్రదించింది. రెండు రోజులుగా నాపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది. కానీ, నేను ఎలాంటి నిరసనలు తెలపాలనుకోవట్లేదు. తెలపను కూడా. సమాజం కోసమే సేవ చేస్తున్న నాకు అలాంటి వారే ఆదేశాలు ఇవ్వగలరు. నన్ను శాసించే హక్కు బీజేపీకి లేదు. వారి ఆదేశాలను నేను పాటించాల్సిన అవసరమే లేదు. ఇక, నేనేం రాహుల్ లేదా కాంగ్రెస్ మద్దతుదారుడిని కాదు. నాకు ఏ పార్టీ అయినా ఒకటి. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. ఈ అంశంపై ఆయన్ను ఎందుకు వ్యతిరేకించాలి? ఏ అంశంపై ఆందోళనలు చేయాలనేది నా వ్యక్తిగత విషయం’ అని ఆయన వీడియోలో పేర్కొన్నారు.

కాంగ్రెస్ విమర్శలు

రాజారత్నం అంబేద్కర్ వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్ బీజేపీపై విరుచుకు పడుతోంది. కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనాథే బీజేపీపై విమర్శలు గుప్పించారు. “ఆయన బాబాసాహెబ్ ముని మనవడు - డాక్టర్ రాజారత్న అంబేద్కర్. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి బీజేపీ ఆయనపై ఎలా ఒత్తిడి చేసిందో స్పష్టంగా తెలుస్తోంది. కానీ, నిజమైన అంబేద్కరిస్టు అయిన రాజారత్నకు రాహుల్ గాంధీ ప్రకటనలో ఎలాంటి తప్పు కన్పించలేదు. రాహుల్ గాంధీ 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ముగిస్తారు” అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో హిందీలో రాసుకొచ్చారు. ఇక, అమెరికా పర్యటనలో భాగంగా రిజర్వేషన్ల అంశంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ప్రస్తుతం భారత్‌లో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆయన అన్నారు. దేశంలో అన్నివర్గాల వారికీ పారదర్శకంగా అవకాశాలు వచ్చిన తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాహుల్‌పై ఎన్డీఏ తీవ్ర విమర్శలు గుప్పించింది.


Similar News