మీ నుంచి నన్నెవ్వరూ దూరం చెయ్యలేరు : రాహుల్ గాంధీ

Update: 2023-04-11 15:42 GMT

న్యూఢిల్లీ: ఎంపీగా లోక్‌సభ అనర్హత వేటు పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేరళలోని పూర్వ నియోజకవర్గం వయనాడ్‌లో మంగళవారం పర్యటించారు. కల్పేట పట్టణంలో నిర్వహించిన ‘సత్యమేవ జయతే’ రోడ్ షోలో ఆయన తన సోదరి, కాంగ్రస్ పార్టీ ప్రధన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొన్నారు. తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ కనిపించారు. ‘వాళ్లు (బీజేపీ) నా ఇంటిని తీసేసుకోవచ్చు. నన్ను జైలులో పెట్టొచ్చు. కానీ వయనాడ్ ప్రజల సమస్యలకు, వారికి ప్రాతినిధ్యం వహించడానికి నన్ను దూరం చేయలేరు’ అని రాహుల్ అన్నారు. తన నుంచి ఎంపీ ట్యాగ్‌ను మాత్రమే తీసుకున్నారని.. కానీ మీకు ప్రాతినిధ్యం వహించడం అంతకంటే ఎక్కువే అని ఆయన చెప్పారు.

‘నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఎంపీని అయ్యాను. ఆ ప్రచారం చాలా భిన్నమైంది. ఎందుకంటే సాధారణంగా ప్రచారంలో పార్టీ విధానాల గురించి మాట్లాడతారు. కానీ 2014లో నా ప్రచారం భిన్నంగా జరిగింది. కేరళ ప్రజలు తమ ఆప్యాయతను నాకు పంచారు. తమ కుటుంబంలో సభ్యుడిలా, ఓ కొడుకులా భావించారు. నేను చాలా ఆలోచించాను. ఎంపీగా కొన్నాళ్లు ఉన్నాను. అయితే ఎంపీ అంటే ప్రజల అవసరాలను తీర్చి వారి భావద్వేగాలు, బాధలు పంచుకునే ప్రజా ప్రతినిధి అని అర్థం చేసుకోవాలి’ అని రాహుల్ చెప్పారు.

చాలా కాలంగా బీజేపీతో పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. తనను భయపెట్టలేమని, పోలీసుల ద్వారా బెదిరించలేమని వారికి అర్థమైందని చెప్పారు. తాను ఇకపై ఎంపీగా కొనసాగలేనందున ఢిల్లీలోని అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సివచ్చినప్పుడు సంతోషించానని అన్నారు. తనకు కూడా అక్కడ ఉండటం ఇష్టం లేదని చెప్పారు. వయనాడ్ వరదల్లో ఎంత మంది ఇళ్లు కోల్పోయారో, వారు ఎలా పోరాడారో చూశానని రాహుల్ అన్నారు.

Tags:    

Similar News