Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ భద్రతా సిబ్బందిపై వేటు
బిహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) భద్రత విభాగంలోని సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) భద్రత విభాగంలోని సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తేజ్ ప్రతాప్ ఆదేశంతో హోలీ రోజున డ్యాన్స్ చేసిన పోలీస్‌పై వేటు పడింది. డ్యాన్స్ చేయకపోతే సస్పెండ్ అవుతావన్న తేజ్ ప్రతాప్ బెదిరింపుతో ఆ పోలీస్ డ్యాన్స్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ కానిస్టేబుల్‌ను సెక్యూరిటీ గార్డు బాధ్యతల నుంచి తప్పించారు. పోలీస్ లైన్‌కు ఆయనను అటాచ్ చేశారు. కాగా.. తేజ్ ప్రతాప్ భద్రత కోసం ఆయన స్థానంలో మరో పోలీస్ కానిస్టేబుల్‌ను నియమిస్తామని ఎస్పీ కార్యాలయం తెలిపింది. ‘ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ సెక్యూరిటీ గార్డుగా నియమించిన కానిస్టేబుల్ దీపక్ కుమార్ యూనిఫాంలో డ్యాన్స్ చేసినందుకు తక్షణమే పోలీసు లైన్లకు పంపడం జరిగింది. దీపక్ కుమార్ స్థానంలో ఎమ్మెల్యే సెక్యూరిటీ కోసం మరో కానిస్టేబుల్‌ను నియమిస్తారు’ అని ఎస్పీ ఆఫీస్ ప్రకటనలో తెలిపింది.
ట్రాఫిక్ చలాన్
అంతేకాకుండా, తేజ్ ప్రతాప్ చేసిన పనికి మరోవ్యక్తికి జరిమానా పడింది. హోలీ పండుగ రోజు తేజ్ ప్రతాప్ యాదవ్ తన నివాసం సమీపంలోని ప్రాంతాల్లో స్కూటర్‌పై తిరిగారు. అయితే, హెల్మెట్ లేకుండా స్కూటర్ డ్రైవ్ చేయడం, ఆ బైక్ కి పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా లేకపోవడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆ స్కూటర్ యజమానికి పాట్నా ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. స్కూటర్ యజమానికి రూ. 4,000 మేర చలాన్లు జారీ చేసినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారి తెలిపారు.