ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్‌రూమ్‌లో సీసీటీవీలు ఆఫ్ చేయడంపై సందేహాలు: సుప్రియా సూలే

ఎఫ్‌సీఐ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన సీసీటీవీలను సోమవారం 45 నిమిషాల పాటు ఆఫ్ చేశారని..

Update: 2024-05-13 12:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లోని సీసీటీవీలను దాదాపు 45 నిమిషాల పాటు ఆఫ్ చేయడంపై ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) సందేహాలు వ్యక్తం చేసింది. పార్టీ చీఫ్ శరద్ పవార్ కుమార్తె, బారామాతి లోక్‌సభ అభ్యర్థి సుప్రియా సూలే ఈ పరిణామాలపై సందేహాలున్నాయని, లోపల ఏదో తప్పు జరిగిందని ఆమె ఆరోపణలు చేశారు. ప్రతిష్టాత్మకమైన బారామతి స్థానానికి మే 7న 10 ఇతర నియోజకవర్గాలతో పాటు మూడవ దశలో పోలింగ్ జరిగింది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ రెబల్ అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ బీజేపీ అభ్యర్థిగా ఉండగా, ఆమెపై సుప్రియా సూలే పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గం పోలింగ్ పూర్తయిన తర్వాత అప్పటినుంచి ఈవీఎంలను బారామతిలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో భద్రపరిచారు. అయితే, ఈ గోడౌన్‌లో భద్రపరిచిన ఈవీఎంల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీలను సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.15 గంట్ల మధ్య 45 నిమిషాల పాటు ఆఫ్ చేశారని, ఈ విషయాన్ని తమ సిబ్బంది ఎన్నికల అధికారులకు, పోలీసులకు తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపణలు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ లోపల ఏదో తప్పు జరిగిందనే సందేహాలు తమకున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సీసీటీవీ ఆఫ్ అయిన వీడియోను ఎక్స్‌లో ట్వీట్ చేశారు.  

Tags:    

Similar News